Jagan : జగన్ సర్కార్ ఎవరి సొమ్ము వదల్లేదు.. ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల
Jagan : వైసీపీ హయాంలో ఏపీ ఆర్థిక పరిస్థితి, ఆర్థిక అవకతవకలపై సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు. సరైన విధానం లేకుండా రాష్ట్ర విభజన చేయడం వల్ల రాష్ట్రంలో తీవ్ర ఆర్థిక సమస్యలు తలెత్తాయన్నారు. హైదరాబాద్‌ను రాజధానిగా కోల్పోవడంతో ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయన్నారు. ఏపీలో అర్బన్ ప్రాంతాలు తక్కువగా ఉండడంతో ఆదాయం చాలా తక్కువగా ఉందన్నారు. ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రానికి 46 శాతం మాత్రమే ఆదాయం వచ్చిందని ఆయన పేర్కొన్నారు. 52 శాతం జనాభా ఉన్న ఏపీకి 46 శాతం ఆదాయం వస్తే, 42 శాతం జనాభా ఉన్న తెలంగాణకు 54 శాతం ఆదాయం వస్తోందన్నారు.
కృష్ణపట్నం పోర్టు ఏపీలో ఉంటే దాని రిజిస్ట్రేషన్ కార్యాలయం హైదరాబాద్‌లో ఉందన్నారు. కంపెనీలు, ఆస్తులన్నీ హైదరాబాద్ లోనే ఉంటే అప్పులు ఏపీకి మిగులుతాయని, పునర్విభజన చట్టంలోని 9, 10 షెడ్యూల్ సమస్యలు పరిష్కారం కావని శ్వేతపత్రంలో పేర్కొన్నారు. విభజన సమయంలో సేవారంగం మొత్తం తెలంగాణకు వెళితే ఏపీకి వ్యవసాయం వస్తుందని, రాష్ట్రంలో సేవారంగం అభివృద్ధి చెందితే అంతా అభివృద్ధి చెందుతుందన్నారు. వ్యవసాయం ప్రధానమైన ఏ ప్రభుత్వానికైనా తక్కువ ఆదాయం వస్తుందన్నారు.
కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చిన నిధులను సద్వినియోగం చేసుకోవడంలో గత ప్రభుత్వం విఫలమైందని చంద్రబాబు విమర్శించారు. 2019-24 మధ్య రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం జరిగిందని, పన్నులు విపరీతంగా పెంచారని, చివరకు చెత్తకు కూడా పన్ను విధించారని దుయ్యబట్టారు. వైసీపీ హయాంలో జీఎస్డీపీ రూ.6.94 లక్షల కోట్లు తగ్గిందన్నారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేసిన ప్రభుత్వమని, తాము ఇస్తామని చెప్పిన పింఛను సకాలంలో ఇచ్చామన్నారు.
2014-19లో రాష్ట్రం అభివృద్ధి పథంలో పనిచేస్తే 2019-24 మధ్య రాష్ట్రం పూర్తిగా నష్టపోయిందన్నారు. పోలవరం పూర్తయితే సాగునీటి అవసరాలు పూర్తిగా తీరుతాయని చంద్రబాబు అన్నారు. ప్రజా అవసరాల కోసమే పట్టిసీమను తీసుకొచ్చామన్నారు. అమరావతిలో మొదటి అక్షరం ఏ, చివరి అక్షరం ఐ అని.. అమరావతిని కృత్రిమ మేధ నగరంగా తీర్చిదిద్ది పూర్వ వైభవం తీసుకువస్తామని చెప్పారు. ప్రపంచం మొత్తం అమరావతి గురించి చర్చించుకునే రోజు వస్తుందని అన్నారు. 2014-18 మధ్య రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చాయని వివరించారు. రూ.16 లక్షల కోట్లకు ఎంఓయూలు కుదుర్చుకున్నారని, రూ.5 లక్షల కోట్లతో పరిశ్రమలు కూడా ప్రారంభమయ్యాయని చెప్పారు.