Jagan Failure : గత ఎన్నికల్లో తన వ్యూహాలతో జగన్ గెలిపించడానికి పనిచేసిన ప్రశాంత్ కిశోర్ (పీకే) తాజాగా చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఏపీలో వచ్చే ఎన్నికల్లో సీఎం జగన్ పార్టీకి ఘోర పరాభవం తప్పదని ఆయన చెప్పారు. ఆంగ్ల దినపత్రిక ‘ది న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్’ ఆదివారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ..ఏపీ రాజకీయాలు, ఎన్నికల ఫలితాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
ఏపీలో జగన్ ఓడిపోతున్నారని, అది కూడా మాములు ఓటమి కాదని..భారీ ఓటమి తప్పదని ఆయన చెప్పారు. ఏపీలో చదువుకున్న యువత ఉపాధి, ఉద్యోగాల కోసం చూస్తున్నారే తప్ప ప్రభుత్వం ఇచ్చే ఉచితాలు, తాయిలాల కోసం కాదన్నారు. ఐదేళ్లలో మొత్తం వనరులను కొన్ని అంశాలపైనే ఖర్చు పెట్టడం, అభివృద్ధిని పట్టించుకోకపోవడం ద్వారా జగన్ పెద్ద తప్పు చేశారని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం జగన్ పరిస్థితి చూస్తుంటే మళ్లీ అధికారంలోకి రావడం అసాధ్యమన్నారు.
పాలకులు ప్రజలకు అందుబాటులో ఉండాలని, దీనికి భిన్నంగా ప్యాలెస్ ల్లో ఉంటూ ప్రజల బాగోగులన్నీ తామే చూసుకుంటున్నామని భావిస్తున్నారని, ఇలాంటి వైఖరిని ప్రజలు హర్షించబోరని పీకే చెప్పుకొచ్చారు. ప్రజలు ఎన్నుకున్న పాలకులు ఒక ప్రొవైడర్ కంటే మెరుగైన పాత్ర పోషించాలన్నారు. కానీ చాలా మంది నాయకులు తమను తాము ప్రజలకు రాయితీలు కల్పించే ప్రొవైడర్లుగానే భావించుకుంటున్నారన్నారు. అలాంటి వారు ఎన్నికల్లో భారీ మూల్యం చెల్లించక తప్పదని అన్నారు.