YS Jagan : షర్మిలను నేరుగా టార్గెట్ చేసిన జగన్..
YS Jagan : అనుకున్నదే అయ్యింది. కుటుంబంలో నిప్పు రాజుకుంది. అన్నపై చెల్లి.. చెల్లిపై అన్న.. మాటల యుద్ధం మొదలైంది. ఏపీ పీసీసీ బాధ్యతలు తీసుకున్న వైఎస్ షర్మిల 23 (మంగళవారం)వ తేదీ నుంచి ఏపీలో పాదయాత్ర చేపట్టింది. ఇందులో అన్న, వైసీపీ అధినేత, సీఎం జగన్మోహన్ రెడ్డిపై తీవ్రంగా ఫైర్ అయ్యింది. అయితే దీనికి ముందే జగన్ ఒక సభలో ఆమెపై నేరుగా మాటలతో దాడికి దిగాడు. వైఎస్ షర్మిలను జగన్ నేరుగా టార్గెట్ చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు పొరుగు రాష్ట్రానికి చెందిన పలువురు స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారని జగన్ పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్, ఈనాడు రామోజీరావు, ఏబీఎన్ రాధాకృష్ణ, టీవీ5 వంటి స్టార్ క్యాంపెయినర్ల వ్యాఖ్యలను ప్రస్తావించారు.
‘ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను విభజించిన పార్టీకి నేతృత్వం వహిస్తున్న చంద్రబాబు అభిమాన సంఘానికి కొత్తగా చేరిక వచ్చింది’ అంటూ జగన్ తన సోదరి షర్మిలపై బాణం వేశారు. ఏపీని విడగొట్టిన కాంగ్రెస్ పార్టీకి కొత్తగా నియమితులైన షర్మిలను టార్గెట్ చేయడం స్పష్టంగా కనిపిస్తోంది. జగన్ షర్మిల పేరుతో మాట్లాడకున్నా.. ఆమె వైపునకే అందరూ వేలెత్తి చూపారు. ఏపీ పొలిటికల్ వార్ లో షర్మిల, జగన్ ముఖాముఖి తలపడటం ఇదే తొలిసారి.
ఇప్పటికే షర్మిల లిక్కర్ మాఫియా, ఇసుక మాఫియాకు వ్యతిరేకంగా మాట్లాడటం ద్వారా జగన్ పై, వైసీపీ ప్రభుత్వంపై దాడి ప్రారంభించింది. జగన్ స్పందించాల్సిన సమయం ఆసన్నమైందని, షర్మిల స్టార్ క్యాంపెయినర్ అని, ఆమె చంద్రబాబు అభిమాన సంఘానికి కొత్తగా చేరుతున్నారని జగన్ అన్నారు.
ఇంకా ఎన్నికల షెడ్యూల్ రాక ముందు నుంచే ఏపీలో రాజకీయ హీట్ రాను రాను పెరుగుతుంది. ఏపీ పీసీసీ చీఫ్ గా షర్మిల పగ్గాలు చేపట్టిన తర్వాత అన్నా, చెల్లెలి మధ్య తీవ్ర పోటీ వస్తుందని ఏపీ ప్రజలు అనుకుంటున్నారు.