YS Jagan : ఏపీలో ఎన్నికల వేడి రాజుకుంది. అన్ని పార్టీలు దాదాపుగా తమ అభ్యర్థులను ప్రకటించాయి. ఎన్నికలకు మరో 50 రోజుల సమయం మాత్రమే ఉండడంతో పార్టీల అధినేతలు ప్రచార బరిలోకి దిగనున్నారు. నిన్ననే జగన్ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో పర్యటించేందుకు ‘మేమంతా సిద్ధం’ అనే పేరుతో బస్సుయాత్రను ఇడుపులపాయలో ప్రారంభించారు. అనంతరం ప్రొద్దుటూరులో భారీ బహిరంగ సభను నిర్వహించారు. ఇక చంద్రబాబు, పవన్, బీజేపీ నేతలు కూడా ప్రచార సభల్లో పాల్గొంటూనే ఉన్నారు.
ఈ ఎన్నికలు మూడు పార్టీలకు జీవన్మరణ సమస్య అని చెప్పవచ్చు. జగన్ కు రెండో సారి అధికారంలోకి రాకపోతే పాత కేసులు తిరగతోడే అవకాశం ఉంది. అలాగే టీడీపీకి ఈ సారి అధికారం రాకపోతే పార్టీ భవిష్యత్ పై పెను ప్రభావం పడనుంది. పవన్ కల్యాణ్ పార్టీ పెట్టి దాదాపు పదేళ్లు అయ్యింది. ఇప్పటికీ అనుకున్నంతగా ప్రభావం చూపలేదు అనే భావన జనాల్లో ఉంది. ఈ సారి తమకు కేటాయించిన సీట్లలో గెలవడం, ముఖ్యంగా పిఠాపురం నుంచి పవన్ గెలువడం ఆయన నాయకత్వ పటిమకే పరీక్ష అని చెప్పవచ్చు.
ఇదిలా ఉండగా వైసీపీ అధినేత జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శలను చూస్తే ఇద్దరూ ఓ స్ట్రాటజీ ప్రకారం ముందుకెళ్తున్నట్టు కనపడుతోంది. జగన్ ప్రతీ సభలోనూ చంద్రబాబుపై, కాంగ్రెస్, జనసేనలపై తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. కానీ బీజేపీ అగ్రనేతలపై ముఖ్యంగా ప్రధాని మోదీపై ఒక్క విమర్శ చేయడం లేదు. వాస్తవానికి బీజేపీ కూడా వైసీపీకి ఏపీలో ప్రధాన ప్రత్యర్థి. ఎన్నికల్లో ప్రధాన పోటీ ఉండేది వైసీపీ, ఎన్డీఏ కూటమే. కానీ జగన్..చంద్రబాబు, పవన్, షర్మిలను విమర్శిస్తున్నారు..గాని మోదీని ఒక్క మాట అనడం లేదు. ఎందుకంటే కేంద్రంలో మోదీతో సయోధ్యగా ఉండాలని ఆయన ఆలోచిస్తున్నట్టు కనపడుతోంది. రేపటి ఎన్నికల్లో ఏపీలో ఎలాంటి ఫలితాలు వస్తాయో తెలియదు. కానీ కేంద్రంలో బీజేపీకే మొగ్గు ఉండొచ్చని వివిధ సర్వేలు చెబుతున్నాయి. దీంతో బీజేపీపై జగన్ సైలంట్ గా ఉంటున్నట్లు కనిపిస్తోంది.
వాస్తవానికి బీజేపీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం ఏపీపై చిన్నచూపే చూసిందని ఇక్కడి జనాల భావన. దీన్ని టార్గెట్ చేస్తూ ప్రత్యర్థి పార్టీగా జగన్ మోదీని విమర్శించి ప్రజల నుంచి సానుకూల స్పందన రాబట్టుకోవచ్చు. కానీ ఆయన ఆ పని చేయడం లేదు. దీనికి భవిష్యత్ రాజకీయాలే కారణమని చెప్పక తప్పదు. ఇక చంద్రబాబు సైతం కాంగ్రెస్ పై ఇదే రకమైన ధోరణి ప్రదర్శించడం గమనార్హం. జగన్ పై తీవ్రంగా విరుచుకుపడుతున్న చంద్రబాబు కాంగ్రెస్ పై ఏ విమర్శలు చేయడం లేదు. నిజానికి రాష్ట్రం ఇలా మారడానికి ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీనే. అయినా ఆ అంశంపై చంద్రబాబు పెద్దగా దృష్టి పెట్టడం లేదు. కూటమిలో ఉన్న బీజేపీకి ప్రధాన శత్రువు కాంగ్రెస్ పార్టీనే. అయినా కూడా కూటమి నేతలు కాంగ్రెస్ ను పెద్దగా టార్గెట్ చేయడం లేదు.