Jagan Decision : ‘‘జగన్ ఎవరి మాట వినరు.. తాను అనుకున్నదే చేస్తారు’’ అని ఆయన అభిమానులు గొప్పగా చెప్పుకుంటారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 175 సీట్లకు 175 గెలవాలని కంకణం కట్టుకున్న ఆయన.. తన పార్టీలకు సిట్టింగ్ లకు చుక్కలు చూపిస్తున్నారు. ‘మీకు జనాల్లో ఆదరణ లేదు.. మీకు సీటివ్వడం లేదు’ అంటూ చెప్పేస్తున్నారు. ఇప్పటికే మూడు జాబితాల ద్వారా పలువురికి సీట్లు ఖరారు చేసిన వైసీపీ అధినేతపై పలువురు మండిపడుతూ ఇతర పార్టీల్లోకి వెళ్లిపోయారు. కొందరు లోలోన బాధపడిపోతూ పార్టీలోనే ఉండిపోయారు. మరికొందరు తుది జాబితా వరకు వేచి చూసి ఇతర పార్టీల్లోకి దూరిపోవడానికి సరంజామా సిద్ధం చేసుకుంటున్నారు.
ఇక టీడీపీ-జనసేన కూటమి మాత్రం జగన్ పార్టీ అభ్యర్థుల ప్రకటన ముగిసిన తర్వాత.. వారి కన్నా సమర్థులను నిలబెట్టే వ్యూహంతో ఉన్నారు. ప్రస్తుతానికి మ్యానిఫెస్టో, అభ్యర్థుల బలాబలాలు, రాజకీయ సమీకరణాలు ఇలా ప్రతీ విషయంలోనూ ఆచితూచి అడుగు వేస్తున్నారు. రెండో సారి గెలవాలంటే జనాల్లో వ్యతిరేకత ఉన్నా సిట్టింగ్ లను అందరినీ మార్చుదామన్న జగన్ నిర్ణయంపై నాయకుల్లోనే, క్యాడర్ లోనూ తీవ్ర సంతృప్తి నెలకొంది. ఈ విషయాన్ని గమనించిన జగన్.. వాటిని సర్దుబాబు చేసేందుకు సమావేశాలు ఏర్పాటు చేయాలని సంచలన నిర్ణయం తీసుకున్నారు.
జనవరి 25 నుంచి నాలుగైదు జిల్లాలకు సంబంధించిన క్యాడర్ తో జగన్ సమావేశాలు నిర్వహించడానికి రెడీ అయ్యారు. నాలుగు నుంచి ఆరు జిల్లాలను కలిపి ఐదు రీజియన్లలో క్యాడర్ సమావేశాలు నిర్వహిస్తామని వైసీపీ పెద్దలు చెబుతున్నారు. ఈనెల 25న విశాఖపట్టణం భీమిలిలో తొలి సమావేశం నిర్వహించనున్నారు. మిగిలిన నాలుగు ప్రాంతాల తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు.
రాబోయే ఎన్నికల్లో ఏరకంగా ముందుకెళ్లాలో క్యాడర్ కు, నాయకులకు జగన్ సూచించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశాలు పూర్తయిన తర్వాత ప్రజల మధ్యలోకి జగన్ వెళ్తారని సమాచారం. కాగా, తన మార్పులు, చేర్పులు వ్యూహంతో నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయని ముందే గ్రహించిన జగన్ అసంతృప్తులన బుజ్జగించేందుకే ఇలా చేస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు.