Jagan Criticizes Babu Vision : టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ సీఎం జగన్ మరోసారి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. పల్నాడు జిల్లాలోని మాచర్ల వద్ద వరికపుడిశెల ఎత్తిపోతల పథకాన్ని బుధవారం సీఎం జగన్ అట్టహాసంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు. అయితే గత పాలకులు ఎలాంటి అనుమతులు లేకుండానే ప్రాజెక్ట్ నిర్మాణాన్ని చేపట్టారని, ఇప్పుడు మేం అన్నీ అనుమతులు వచ్చాకే ప్రారంభిస్తున్నామని గొప్పగా చెప్పుకున్నారు.
అయితే ఈ సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. 14 ఏండ్ల పాటు సీఎంగా ఉండి కూడా ప్రజలకు మంచి చేయలేదని మండిపడ్డారు. 50 ఏండ్ల విజన్ అంటున్నారని, అప్పటివరకు బతికుండేదవరని ప్రశ్నించారు. కుప్పం ప్రజలకే కనీసం తాగునీటిని ఇవ్వలేకపోయాడని ఆరోపించారు. సొంత మామనే వెన్నుపోటు పొడిచిన వ్యక్తి ప్రజలకు మంచి ఏం చేస్తారని ప్రశ్నించారు.
చంద్రబాబులా పొత్తులు, కుట్రలు తనకు తెలియవని, కేవలం ప్రజలనే నమ్ముకొని రాజకీయాలు చేస్తున్నానని చెప్పారు. ఇక రానున్న ఎన్నికల్లో గెలిచేందుకు పేదలపై ప్రేమ చూపుతున్నాడని, కేజీ బంగారం, బెంజ్ కారు ఇస్తానని ఆఫర్లు కూడా ఇస్తాడని చంద్రబాబును ఎద్దేవా చేశారు. తన మాటలు ఎవరూ నమ్మట్లేదని, చంద్రబాబు మరో నలుగురిని తనతో జత చేసుకొని కుట్రలు చేస్తున్నాడని, ప్రజలు దీనిని తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు.