Sujana Chowdary : సుజనా దెబ్బకు అభ్యర్థిని మార్చే పనిలో జగన్.. విజయవాడ వెస్ట్ లో వార్ వన్ సైడే..

Sujana Chowdary

Sujana Chowdary

Sujana Chowdary : ఏపీ ఎన్నికల్లో వైసీపీకి చుక్కలు కనిపిస్తున్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ధాటికి వైసీపీ విలవిలలాడుతోంది. పైకి 175 సీట్లు గెలుస్తామని బింకాలు పలుకుతున్నా లోలోపల భయంతో వణికిపోతోంది. టీడీపీ కూటమి ప్రతీ నియోజకవర్గంలో బలమైన అభ్యర్థునుల బరిలో దించడంతో భరించలేకపోతోంది. పలు చోట్ల తమ బలహీన అభ్యర్థులను మార్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. టీడీపీ కూటమి బలంగా ఉన్న విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలోనూ అభ్యర్థి మార్పు చేయాలని భావిస్తోంది. బీజేపీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి బరిలో ఉండడంతో వైసీపీకి ఘోరా పరాజయం తప్పదనే సర్వేలతో అక్కడి అభ్యర్థిని మార్చాలని యోచిస్తున్నట్లు సమాచారం.

విజయవాడ వెస్ట్ సీటు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇక్కడ బలమైన అభ్యర్థి సుజనా చౌదరి పోటీలో ఉండడంతో అందరి కళ్లు ఈ నియోజకవర్గంపైనే ఉన్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావును విజయవాడ సెంట్రల్ కు పంపిన వైసీపీ.. షేక్ ఆసిఫ్ ను బరిలో దించింది. ఈ నియోజవర్గంలో ముస్లిం ఓటు బ్యాంకు భారీగానే ఉండడంతో మైనార్టీ అభ్యర్థిని రంగంలోకి దించారు జగన్.

విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో మొత్తం 2,32,555 మంది ఓటర్లు మంది ఉన్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి విజయం సాధించారు. ఆయనకు 58,435 ఓట్లు వచ్చాయి. 38.04శాతం ఓట్లను సాధించారు. ఆ తర్వాత టీడీపీ అభ్యర్థి షబానా ముసరత్ ఖాతూన్ కు 50,764 ఓట్లు వచ్చాయి. 33.04 శాతం ఓట్లను దక్కించుకున్నారు. ఇక మూడో స్థానంలో జనసేన అభ్యర్థికి పోతిన మహేశ్  కు 22, 367 ఓట్లు వచ్చాయి. 14.56 శాతం ఓట్లను సాధించారు.

ఆ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ వేర్వేరుగా పోటీ చేశాయి. దీంతో వైసీపీకి విజయం సాధించగలిగింది. వాస్తవానికి టీడీపీ, జనసేన ఓట్లు కలిస్తే 72వేల ఓట్ల పైచిలుకు వచ్చాయి. అంటే వైసీపీ అభ్యర్థి కంటే 14 వేల ఓట్లు అధికం. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు.. టీడీపీ, జనసేన కలిస్తే ప్రభంజనమే అని. గత ఎన్నికల్లో జరిగిన తప్పును పునరావృతం చేయవద్దనే ఆలోచనతోనే టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ పొత్తులు కుదుర్చుకున్నారు. వీరితో పాటు బీజేపీ కలువడంతో ఇక కూటమికి ఘన విజయమేనని విశ్లేషణలు ఊపందుకున్నాయి.

దీంతో వైసీపీ అధినేత జగన్ పునరాలోచనలో పడ్డట్టు తెలుస్తోంది. అందుకే విజయవాడ వెస్ట్ అభ్యర్థి షేక్ ఆసిఫ్ ను మార్చాలని భావిస్తున్నట్లు సమాచారం. సుజనా చౌదరిలాంటి బలమైన అభ్యర్థిపై బలహీన ఆసిఫ్ గెలువడం అసాధ్యమని తెలుస్తోంది. ఈ నియోజకవర్గంలో ముస్లిం సామాజిక వర్గమే కాకుండా బీసీ, ఎస్సీ, కాపు ఓట్లు కూడా కీలకం. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా బరిలో సుజనా చౌదరి ఈ సామాజికవర్గాల ఓట్లు గంపగుత్తగా ఒడిసి పట్టే పనిలో ఉన్నారు.

జగన్ పాలనలో రాష్ట్రంలోని అన్ని వర్గాల్లో అసంతృప్తి ఉంది. ముఖ్యంగా పట్టణ ఓటర్లలో వైసీపీపై తీవ్ర వ్యతిరేకత ఉంది. నిరుద్యోగం, మౌలిస సదుపాయాలు, రాజధాని సమస్య, పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు తరలివెళ్లడం లాంటి సమస్యలు వైసీపీపై పెను ప్రభావం చూపనున్నాయి. ఇక విజయవాడ వెస్ట్ పూర్తిగా పట్టణ ఓటర్లు ఉండడంతో వైసీపీకి ఇక్కడ డిపాజిట్ దక్కే అవకాశాలు లేవని తెలుస్తోంది.

బలమైన అభ్యర్థి బరిలో ఉండడం, మూడు ప్రధాన పార్టీలు జట్టు కట్టడం, చంద్రబాబు లాంటి అనుభవశీలి నేతృత్వంలో అధికారం చేజిక్కించుకునే అవకాశాలు మెండుగా ఉండడంతో విజయవాడ వెస్ట్ లో సుజనా చౌదరి గెలుపు సునాయాసమే. బలహీన అభ్యర్థిని మార్చినా జనాలు ఇప్పటికే సుజనాకు ఓటు వేయాలని ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. సుజనా గెలుపు ఇప్పటికే ఖాయమైపోయిందని, తమ ప్రయత్నమంతా భారీ మెజార్టీ కోసమేనని కూటమి శ్రేణులు ఫుల్ జోష్ గా చెపుతున్నాయి.

TAGS