YS Jagan : జగన్ వాళ్లనే నమ్ముకున్నాడు..గట్టుకు చేరుస్తారా? ముంచేస్తారా?
YS Jagan : ఎన్నికల షెడ్యూల్ రావడంతో ఏపీలోని పార్టీలన్నీ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. అభ్యర్థుల ప్రకటనను పూర్తిచేసి ప్రచార బరిలోకి దిగబోతున్నాయి. ఇప్పటికే అన్ని పార్టీల ప్రధాన నేతల ప్రచార షెడ్యూల్స్ సిద్ధమైపోయాయి. అయితే ఈసారి ఎన్నికల్లో అత్యంత కీలకమైన నిర్ణయాన్ని జగన్ తీసుకున్నారు. ఇది వర్క్ అవుట్ అయితే భవిష్యత్ లో మిగతా పార్టీలు కూడా జగన్ దారిలోకే వస్తాయి. లేదంటే అటు వైపు కూడా ఎవరు కన్నెత్తి చూడరు. ఈ ఎన్నికల్లో కీలకమైన ఆ అంశం ఏంటో చూద్దాం..
రాష్ట్ర జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలకు రాజ్యాధికారం ఇప్పటికీ దక్కలేదు. వందకు పైగా కులాలు ఉన్న, ప్రతీ నియోజకవర్గంలోనూ అభ్యర్థులను గెలిపించుకునే సత్తా ఉన్న బీసీలు రాజకీయంగా చాలా వెనకబడి ఉన్నారు. గతంలో పలు పార్టీలు బీసీలను ప్రాధాన్యం ఇచ్చినా పెద్దగా విజయవంతం కాలేదు. దీనికి పలు కారణాలు ఉన్నాయి. ఒక్క ఎన్టీఆర్ మాత్రం సక్సెస్ అయినా తర్వాత ఎవరూ కాలేకపోయారు. 1983 ఎన్నికల్లో ఎన్టీఆర్ బీసీలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. ఇది ఆ ఎన్నికల్లో సత్ఫలితాలను తీసుకొచ్చింది. అప్పటిదాక అసెంబ్లీ అంటే తెలియని కులాలు చట్టసభలోకి అడుగుపెట్టగలిగాయి. అప్పట్నుంచి బీసీ కులాలు ఆ పార్టీకి వెన్నంటి ఉన్నాయి.
ఇక ఆ తర్వాత మారిన పరిణామాలతో బీసీలను ఎవరూ పట్టించుకోలేదు. చాలా కాలం తర్వాత మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం ద్వారా 100 మంది బీసీలకు టికెట్లు ఇచ్చి పెద్ద సాహసమే చేశారు. అయితే ఆ ఎన్నికల్లో అప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా ఆయన ఎక్కువ సీట్లను దక్కించుకోలేపోయారు. ఇక ఆ తర్వాత బీసీలను తమ వాళ్లుగా చెప్పుకున్న పార్టీలేవి వారి జనాభాకు అనుగుణంగా సీట్లు ఇవ్వలేకపోయాయి. కానీ ఆ తర్వాత 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్ బీసీలకు గణనీయంగా ఇచ్చారు. అప్పుడున్న పరిస్థితుల వల్ల జగన్ కు ఒక్కసారి చాన్స్ ఇద్దామనుకున్న ప్రజలు ఆ ఎన్నికల్లో ఆయనకు అధికారం ఇచ్చారు.
అయితే మరో రెండు నెలల్లో జరుగబోయే ఎన్నికల్లో జగన్ అధికారంలో ఉండి బీసీలకు బాగానే సీట్లు ఇచ్చారు. 48 అసెంబ్లీ సీట్లు, 11 ఎంపీ సీట్లు ఇచ్చారు. ఈ ఐదేళ్లనుంచి నామినేటెడ్ పోస్టులను కూడా వారికి బాగానే కేటాయించారు. తాజా ఎన్నికల్లో ఓ రకంగా చెప్పాలంటే జగన్ సాహసం చేశారనే చెప్పాలి. ఎందుకంటే మిగతా వర్గాల్లో ఉన్నట్టుగా ఐక్యత బీసీల్లో రాలేదు. రాజకీయాలను శాసించే జనాభా, రాజకీయాధికారం చేపట్టే సత్తా ఉన్నా బీసీలు ఐక్యత లేకపోవడంతో వారి లక్ష్యాలను చేరుకోలేకపోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఆది నుంచి ఇప్పటివరకూ రెడ్డి, కమ్మ, వెలమలదే రాజ్యాధికారం. కానీ ఒక్క బీసీ సీఎం రాలేదు. బీసీల వైఖరి వల్లే ఇతర అగ్రకులాలు వారిని చెప్పుచేతల్లో పెట్టుకుంటున్నాయి. అయితే తాజా ఎన్నికల్లో జగన్ గెలవడం బీసీల చేతుల్లోనే ఉంది. మరి వారు జగన్ ను గెలిపిస్తారా? ఓడిస్తారా? అనేది చూడాలి.