Jagan : అసెంబ్లీ సమావేశాలకు జగన్ దూరం?

Jagan

Jagan

Jagan : అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ సభ్యులు హాజరయ్యే అవకాశం లేదని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నేడు జగన్ తన పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి ఢిల్లీకి వెళ్తున్నారు. రేపు అక్కడ ధర్నా నిర్వహించి, గురువారం మళ్లీ ఏపీకి తిరిగి రానున్నారు. తర్వాత శుక్రవారం ఒక్కరోజు మాత్రమే సమావేశాలు ఉంటాయి. అందువల్ల వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చే అవకాశాలు లేవని తెలుస్తోంది. నిన్న సభకు వచ్చిన జగన్ కాసేపటికే వాకౌట్ చేసి వెళ్లిపోయారు.

ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో  ఘోరంగా ఓడిపోయిన వైసీపీ.. కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది. దీంతో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు.  అధికారం ఉంటే ఒకలా.. లేకుంటే మరోలా అంటారే అచ్చం అలాగే ఇప్పుడు మాజీ సీఎం ప్రవర్తన ఉంది. ఒకానొక సందర్భంలో అసెంబ్లీ వేదికగా టీడీపీకి ఉన్న 23 ఎమ్మెల్యేలను హేళన చేస్తూ.. మేం డోర్లు తెరిస్తే, ఆరు ఏడుగురిని చేర్చుకుంటే కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోతుందని జగన్ చేసిన కామెంట్స్ సరిగ్గా ఆయనకే సెట్ అయ్యాయి. ఎంతలా అంటే.. బయటికి చెప్పుకోలేక, నోరు మెదపలేక మదనపడుతున్న పరిస్థితి.

ఇప్పుడు ఆయనకు అదే పరిస్థితి తలెత్తడంతో జగన్ అసెంబ్లీకి రావాలంటేనే భయపడుతున్నట్లు తెలుస్తోంది. అంతకుముందు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే వెళ్లిపోయిన జగన్.. నిన్న గవర్నర్ ప్రసంగం మధ్యలో వెళ్లిపోయారు. ఢిల్లీలో ధర్నా పేరుతో జగన్ అసెంబ్లీ నుంచి పారిపోయారని పలువురు విమర్శించారు. బుధవారం ఢిల్లీలో ధర్నాకు దిగుతున్నామని వైసీపీ నేతలకు జగన్ పిలుపునిచ్చారు. ఇతర పార్టీల నుంచి ఎవరు వచ్చినా ఆహ్వానిస్తామని చెప్పారు. అర్ధంతరంగా చేస్తున్న ధర్నాకు ఎవరు వచ్చి మద్దతు తెలుపుతారో తెలియడం లేదని తెలుస్తోంది. వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ అసెంబ్లీ ఆవరణలో పోలీసు అధికారులపై మండిపడ్డారు. సోమవారం అసెంబ్లీ సమావేశాల తొలిరోజే ఆయన అసహనాన్ని ప్రదర్శించారు. పోలీసు అధికారిని ఏకవచనంతో, పేరుతో పిలిచి పలు హెచ్చరికలు చేశారు.

ప్రస్తుతం జగన్ అధికారిక హోదా ‘ఎమ్మెల్యే’ మాత్రమే. ప్రతిపక్ష నేత హోదా కూడా లేదు. ముఖ్యమంత్రి, మంత్రులు మినహా ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల వాహనాలను అసెంబ్లీ ఆవరణలోకి అనుమతించరు. సోమవారం అసెంబ్లీలోని నాలుగో నంబర్ గేటు వద్ద ప్రతిపక్షనేత హోదా లేని జగన్ వాహనాన్ని భద్రతా సిబ్బంది ఆపారు. ఆ తర్వాత జగన్‌తోపాటు వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నల్ల కండువాలు కప్పుకుని ప్లకార్డులు పట్టుకుని వస్తున్న వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో జగన్ మండిపడ్డారు. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని ధ్వజమెత్తారు.

TAGS