Jagan and KCR : ఏకాకులు ఎవరో.. ఇద్దరు మిత్రులు ఎవరో అందరికీ అర్థమయ్యే ఉంటుంది కదా.. వారేనండి తెలంగాణ, ఏపీ మాజీ సీఎంలు కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి. జగన్, కేసీఆర్ ఇద్దరూ వేర్వేరు కారణాలతో దేశ రాజకీయాల్లో ‘రాజకీయ ఏకాకులుగా మిగిలారు. వీరు మంచి మిత్రులు కావడం.. ఇద్దరూ ఒకేసారి రాజకీయ నిరుద్యోగులుగా మారడం ఆలోచించే విషయం.
తెలంగాణలో కేసీఆర్ కాంగ్రెస్, బీజేపీలతో యుద్ధం చేస్తున్నారు కాబట్టి ఆ పార్టీల మిత్రపక్షాలను దూరం పెట్టారు. అవిపోగా మిగిలినవి వేళ్లపై లెక్కపెట్టచ్చు. కానీ వాటి అవసరం కూడా తనకు లేదని టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చారు.
రైతు సంఘాల నేతలు, రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకోవాలనుకుంటున్న వారు, రాజకీయ నిరుద్యోగులను కలుపుకొని చక్రం తిప్పి మోడీని గద్దె దించవచ్చని అనుకున్నారు. కానీ సొంత రాష్ట్రంలోనే రెండు ఎన్నికల్లో ఘోర పరాజయం పాలయ్యారు. ప్రస్తుతం ఫామ్ హౌజ్ కు పరిమితమైన ఆయన అక్కడి నుంచి బయటకు రావడం లేదు. పార్టీ వ్యవహారాలను ఆయన కొడుకును చూసుకోమని చెప్పారు.
కేసీఆర్ రాజకీయ సన్యాసం తీసుకొని పార్టీని కొడుకుకు అప్పగిస్తే మరోలా ఉండేది. కానీ కేసీఆర్ ఫామ్‌హౌస్ కే అంకితమై కొడుకును తిప్పుతుండడంతో ప్రజలు, రాజకీయ వర్గాలకు తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయి. బీఆర్ఎస్ ఇప్పుడు నాయకత్వం లేని పార్టీగా కనిపిస్తోంది. అందుకే చాలా వరకు డ్యామేజ్ జరుగుతోంది.
ఇక ఏపీ సీఎం గురించి తెలుసుకుంటే.. జగన్ తనకు మరో 20-30 ఏళ్లు రాజకీయాలు చేయగల వయసు, ఓపిక, సామర్ధ్యం ఉన్నాయని చెప్పుకున్నారు. పైగా ఇంకా కేసులు కూడా మొదలవలేదు. 24న ఢిల్లీలో ధర్నా పెట్టుకున్నారు.
జగన్ తనపై ఉన్న కేసుల కారణంగా మోడీని కాదని దిక్కులు చూడలేని నిస్సహాయత ఉంది. మోడీ పట్టించుకోకపోయినా ఆయనకు ఆగ్రహం కలిగించే పనులు చేయలేరు. ఈ విషయం జాతీయ స్థాయి పార్టీలకు కూడా తెలుసు. అవి కూడా ఆయనను పట్టించుకోకపోవచ్చు.
జగన్, కేసీఆర్ ఇద్దరూ మంచి మిత్రులే.. ఇద్దరూ ప్రస్తుతం కష్టాల్లో ఉన్నారు. కనుక ఒకరికొకరు సాయం చేసుకోవచ్చు. ఢిల్లీలో ధర్నాకు బీఆర్ఎస్ నేతలను పంపాలని అడిగే హక్కు జగన్‌కు ఉంది. బహుశః కేసీఆర్ కూడా కష్టంలో ఉన్న తన మిత్రుడికి సాయపడాలనే మనస్సులో ఉండవచ్చు.
కానీ కూతురు కవిత జైల్లోనే ఉంది. అదీగాక ఎన్డీయే ప్రభుత్వంలో టీడీపీ ఉంది. కనుక కేసీఆర్ కూడా మోడీకి ఆగ్రహం తెప్పించే పనులు చేయరు. కనుక ఇద్దరు ఏకాకులు మళ్లీ ఏకాకులుగానే ఉంటారు. ఇద్దరూ మిత్రులే అయినప్పటికీ సాయం చేసుకోలేకపోతున్నారు పాపం!