Nara Lokesh : టీడీపీ యువ నేత లోకేశ్ ‘శంఖారావం’ పేరిట నియోజకవర్గాల్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. తన ప్రసంగాల్లో లోకేశ్ రోజురోజుకూ ఘాటు డోసు పెంచుతున్నారు. వైసీపీ నేతలను తన ప్రాసలతో ఆటాడుకుంటున్నారు. నిన్న(గురువారం) విజయనగరం జిల్లాలో ఆయన పర్యటన సాగింది. వైసీపీ నేతలపై లోకేశ్ తీవ్రంగా విరుచుకుపడ్డారు.
కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలపై సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులపై నారా లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘జగన్ పేటీఎం కూలీలకు ఐదు రూపాయలిచ్చి.. ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల పెళ్లిపై, పుట్టుకపై నీతి లేకుండా విమర్శలు చేయిస్తున్నాడు. షర్మిల పెళ్లి, పుట్టుక ఈ పేటీఎం బ్యాచ్ కు ఇప్పుడే గుర్తుకొచ్చాయా?’’ అని మండిపడ్డారు. నిత్యం వైఎస్ పేరు చెప్పుకొని బతికే జగన్ కు అవమానం కాదా? అని నిలదీశారు.
విజయనగరం జిల్లాలోని చీపురుపల్లి నియోజకవర్గంలో నిర్వహించిన శంఖారావం సభలో నారా లోకేశ్ మాట్లాడుతూ.. మంత్రి బొత్స నారాయణ కుటుంబంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. మంత్రి బొత్స పెన్నులో ఇంకు.. అవినీతి ఫైళ్లపై సంతకాలు చేసేందుకే సరిపోతోందని దుయ్యబట్టారు. మంత్రి బొత్స కుటుంబమంతా విజయనగరం జిల్లాకు కేన్సర్ గడ్డలా తయారైందని మండిపడ్డారు. బొత్స అనే కేన్సర్ గడ్డకు ‘ఓటు’ అనే రేడియేషన్ అవసరమని అప్పుడే దాన్ని తొలగించగలమన్నారు.
ఇక జగన్ పై కూడా లోకేశ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జగన్ ఓ 420 అని, ఆయన సలహాదారులు 840..అన్నారు. ‘‘అధికారం ఉందని ఏకపక్షంగా వ్యవహరించిన వైసీపీ నేతలు, అధికారుల పేర్లను రెడ్ బుక్ లో రాసుకున్నా.. జగనే అసమర్థుడంటే ఆయన మంత్రివర్గమంతా చెత్తగాళ్లే’’ అని నారా లోకేశ్ నిప్పులుచెరిగారు. టీడీపీ-జనసేన ప్రభుత్వం ఏర్పడగానే వైసీపీ మంత్రుల అవినీతిపై అక్రమాలపై చర్యలు ప్రారంభిస్తామని, ప్రతీ ఫైలును సమీక్షించి..కటకటాల్లోకి నెడుతామని వ్యాఖ్యానించారు.