Jacqueline:మోసగాడు సుఖేష్ చంద్రశేఖర్ పరిచయం అవసరం లేదు. అతడు 200 కోట్ల దోపిడీ, మోసం కేసులో జైలు జీవితం గడుపుతున్న సంగతి తెలిసిందే. పలువురు సెలబ్రిటీలను మభ్య పెట్టి, వారి నుంచి బారీగా డబ్బును దోపిడీ చేసాడన్న ఆరోపణలపై సుఖేష్ ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. అయితే అతడు దోచుకున్న డబ్బు నుంచి బహుమతులు అందుకున్నారన్న ఆరోపణలపై పలువురు కథానాయికలను ఈడీ ప్రశ్నించింది.
ఇందులో సాహో బ్యూటీ, బాలీవుడ్ హాట్ గాళ్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ పేరు ప్రముఖంగా వినిపించింది. వివాదాస్పద కాన్ మేన్ సుకేష్ చంద్రశేఖర్ తో సాన్నిహిత్యం ఈ భామ కొంప ముంచింది. అతడితో సన్నిహితంగా ఉన్న ఫోటోలు లీకవ్వడంతో ఈ సంబంధం నిజమైనదేనని అంతా భావించారు. జాక్వెలిన్ సుఖేష్ తో ప్రేమలో ఉందని అంతా భావించారు. దానికి తగ్గట్టుగానే సుఖేష్ చంద్రశేఖర్ జైలు నుంచే జాక్వెలిన్ కి వరుసగా ప్రేమలేఖలు రాసాడు. జైలుకి వెళ్లినప్పటి నుంచి జాకీపై తన ప్రేమను ఏదో ఒక రకంగా వ్యక్తం చేస్తూనే ఉన్నాడు.
తనని అమితంగా ప్రేమిస్తున్నానని, త్వరలో జైలు నుంచి బయటికి వచ్చి మునుపటిలా జీవిస్తామని భరోసానిస్తున్నాడు. అంతేకాదు.. తనను తేనెటీగ అంటూ ముద్దుగా పిలిచాడు. తన ప్రేమలేఖల్లో జాక్వెలిన్ పై తనకు ఎలాంటి ప్రేమ ఉంది? ఆ ప్రేమలో ఘాడత ఎంత? అనేది చూపించేందుకు ప్రయత్నించాడు. అయితే సుఖేష్ తనకు ఇలా లేఖలు రాస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఆరోపిస్తూ జాక్వెలిన్ పాటియాలా కోర్టులో పిటిషన్ దాఖలు చేసారు.
ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, దోపిడీ సొమ్ముల నుంచి తాను బహుమతులు అందుకోలేదని జాక్వెలిన్ వాదిస్తోంది. ప్రస్తుతం ఈ కేసులో వాదోపవాదాలు కొనసాగుతున్నాయి. విచారణ కొనసాగుతోంది. ఇంతలోనే తనకు రక్షణ కల్పించాలని, సుఖేష్ బెదిరిస్తున్నాడని ఆరోపిస్తూ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం హాట్ టాపిక్ గా మారింది.