Jacqueline Fernandez:బాలీవుడ్ అందాల నటి జాక్విలిన్ ఫెర్నాండెజ్ పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యి అన్న చందంగా మారింది. 200 కోట్ల మోసం కేసులో జైలు ఊచలు లెక్కిస్తున్న కాన్ మేన్ సుకేష్ చంద్రశేఖర్ తో జాక్విలిన్ స్నేహం, సాన్నిహిత్యం తనను ఇరకాటంలో పడేసాయి. జాకీ ఎరక్కపోయి ఇరుక్కుపోయిన సన్నివేశం కనిపిస్తోంది.
సుకేష్ తో జాకీ ప్రేమాయణంలో ఇప్పుడు కొత్త ట్విస్టు బయటపడింది. జైలు నుంచి తనకు నిరంతరం ప్రేమలేఖలు రాస్తున్న సుకేష్ చంద్రశేఖర్ కి ఎదురు తిరిగిన జాక్విలిన్.. తనను లేఖల పేరుతో వేధిస్తున్నాడంటూ కోర్టునాశ్రయించిన సంగతి తెలిసిందే. అతడిని తక్షణమే ప్రేమలేఖలు రాయకుండా నిరోధించాలని కోర్టునాశ్రయించింది. దీంతో చిర్రెత్తిన సుకేష్ ఇప్పుడు జాక్విలిన్ గుట్టంతా బయటపెడతానంటూ మరో బెదిరింపు లేఖను రాయడం కలకలం రేపింది.
ఇక విడిచిపెట్టేదే లేదు.. నీ రహస్యాలన్నిటినీ బయటపెట్టేస్తానంటూ తాజాగా మరో బెదిరింపు లేఖ రాసాడని కథనాలొస్తున్నాయి. సోషల్ మీడియాల్లో ఇమేజ్ పెంచుకునేందుకు కొలీగ్ (సహనటి)తో పోటీపడేందుకు నువ్వు నాతో మిలియన్ల అమెరికన్ డాలర్లు ఖర్చు చేయించావు. డాలర్లను భారతీయ కరెన్సీగా మార్చి నేను చేసిన ఖర్చుల తాలూకా ఇన్ వాయిస్ ఆధారాలన్నీ నాతో ఉన్నాయి. వాటన్నిటినీ బయటపెడతాను! అంటూ సుకేష్ సూటిగా బెదిరించాడు. ఇలాంటి ఎన్నో ఆధారాల్ని బయటపెట్టి రచ్చకీడుస్తానని వార్నింగ్ బెల్ మోగించాడు.
హృదయం ఉన్నది ముక్కలయ్యేందుకే విరిగిపోయేందుకేనంటూ సుకేష్ విరహ కవిత్వం చెప్పాడు. అంతేకాదు.. బతికించినట్టు బతికించి వెన్నుపోటు పొడిచి చంపేసిందంటూ తీవ్రమైన ఆవేదనను వ్యక్తం చేసాడు. తాను ఇంకా జాక్విలిన్ ప్రేమకోసమే బతికి ఉన్నానని తనపై ప్రేమ ఉంది కాబట్టే ఇంకా ఏమీ చేయలేదని కూడా అతడు లేఖలో వ్యాఖ్యానించినట్టు జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి.