Chandrababu : అవినీతి సీఎంను ఇంటికి పంపే టైమొచ్చింది..
Chandrababu : ప్రజల పట్టాదారు పాసుపుస్తకాలపై సీఎం జగన్ బొమ్మను ముద్రించడంపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగన్ చేస్తున్న దౌర్జన్యాలు, దోపిడీలను ప్రశ్నించాలని గుర్తు చేశారు. కడప జిల్లాలో జరిగిన రోడ్ షోల్లో చంద్రబాబు ప్రసంగించారు. అవినీతి సీఎంను ఇంటికి పంపాల్సిన సమయం వచ్చిందన్నారు. రాష్ట్రంలో అరాచక పాలనకు చెక్ పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
భూకబ్జాలతో ప్రజలను మోసం చేశారని గుర్తు చేశారు. పట్టాదారు పాసు పుస్తకాలపై జగన్ బొమ్మ ఎందుకు పెడుతున్నారని ప్రశ్నించారు. భూ చట్టం వైఎస్ జగన్ తెచ్చిందా? లేక వారి తాత తీసుకొచ్చారా? అని అడుగుతున్నారు. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తీసుకొస్తున్నారని ఆరోపించారు. పట్టాదారు పాసుపుస్తకంపై జగన్ బొమ్మ ముద్రించడంలో అర్థమేమిటో తెలియడం లేదన్నారు.
ఇది చట్టంగా మారితే భూములు మీవి కావు. నకలు పత్రాలు మీకు ఇస్తారు. భూమి రికార్డులు మార్చినందు వల్ల చేనేత కార్మికుడి కుటుంబం విషం తాగి ఆత్మహత్య చేసుకుందని గుర్తు చేశారు. వైసీపీకి ఓటు వేస్తే అంతే సంగతి. జాబు రావాలంటే బాబు రావాలి అని నినాదం చేశారు. గంజాయి పాలన అంతం కావాలంటే బాబు రావాలని గుర్తు చేశారు.
జగనన్న ఆస్తిలో చెల్లెలుకు కూడా వాటా ఉంటుందన్నారు. షర్మిలకు రావాల్సిన 50 శాతం వాటా ఇవ్వాల్సిందేనని చెప్పారు. అధికార దాహంతో జగన్ అరాచకాలకు అంతే లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కడపలో స్టీల్ ఫ్యాక్టరీకి రెండుసార్లు శంకుస్థాపన చేశారని నవ్వుకున్నారు. రాయలసీమలో ఒక ఎకరానికి అయినా నీళ్లిచ్చారా? అని ప్రశ్నించారు.
నేరాలు ఘోరాలు చేయడంలో జగన్ ది అందెవేసిన చేయి. పనులు చేయడంలో మాత్రం ముందుకు రారు. రాష్ట్రంలో ఏ చిన్న పని కూడా చేపట్టలేదని గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు.