Sri Chaitanya : శ్రీచైతన్యలో దారుణం.. ఉరేసుకున్న విద్యార్థి సూసైడ్ లేఖ చూస్తే కన్నీళ్లు ఆగవు
Sri Chaitanya : హైదరాబాద్లోని బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న జస్వంత్ గౌడ్ ఆత్మహత్య చేసుకున్నాడు. హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు యత్నించిన జస్వంత్గౌడ్ను గమనించిన కళాశాల సిబ్బంది నిజాంపేటలోని స్థానిక ఆసుపత్రికి తరలించారు. అప్పటికే జస్వంత్ గౌడ్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
అయితే జస్వంత్ గౌడ్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. జస్వంత్ గౌడ్ స్వస్థలం కామారెడ్డి జిల్లా. శ్రీ చైతన్య కాలేజీలో బైపీసీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. కాలేజీ క్యాంపస్ హాస్టల్లో ఉంటున్నాడు. జస్వంత్ గౌడ్ ఉరివేసుకుని మృతి చెందాడని కళాశాల యాజమాన్యం తల్లిదండ్రులకు సమాచారం అందించింది. చిన్నారి మరణవార్త విని తల్లిదండ్రులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. బాగా చదివితే ఉద్యోగాలు వస్తాయని ఆశపడ్డ తల్లిదండ్రులకు కన్నీళ్లు మిగిల్చాడని జస్వంత్ గౌడ్ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థి మృతిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.