AP Weather Report : బయట ఎండ..ఇంట్లో ఉక్కపోత..నిప్పుల కుంపటిలా రాష్ట్రం..

AP Weather Report

AP Weather Report

AP Weather Report : ఏపీలో ఎండలు మండుతున్నయ్. భానుడి భగభగలకు రాష్ట్రం నిప్పుల కుంపటిలా మారిపోతోంది. బయట ఎండ, ఇంట్లో ఉక్కపోతతో జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మార్చిలోనే ఇలా ఉంటే ఏప్రిల్, మే నెలల్లో ఎలా ఉంటుందో అని భయపడుతున్నారు. నిన్న ఉత్తర కోస్తా, రాయలసీమ ప్రాంతాలలోని 31 మండలాలలో వడగాలులు వీచాయని వాతావరణ శాఖ పేర్కొంది. రాయలసీమలో గరిష్ట ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల వరకు నమోదయ్యాయి అంటేనే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో తెలుస్తోంది.

రాష్ట్రంలో పగటిపూట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతున్నాయి. ప్రస్తుతం 2.6 డిగ్రీల నుంచి 2.9 డిగ్రీల వరకు రోజువారీ ఉష్ణోగ్రతలు పెరిగాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. అంతే కాదు రాబోయే రెండు మూడు రోజుల్లో మరింత ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని, వడగాలులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేస్తోంది.

రాష్ట్రంలో ఎండతీవ్రతతో పాటు, వడగాడ్పులు ప్రభావం చూపుతున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. నేడు 42 మండలాల్లో వడగాడ్పులు, రేపు 44 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉందని తెలిపారు. ఈ మండలాల్లో ప్రజలు ఎండ సమయంలో బయటకు వెళ్లకుండా ఉంటే మంచిదని సూచించారు.

వైఎస్ఆర్ కడపలోని 18 మండలాలు, నంద్యాల జిల్లాలోని 8 మండలాలు, పార్వతీపురం మన్యం జిల్లాలోని 8 మండలాలు, ఎన్టీఆర్ జిల్లాలోని 6 మండలాలు, గుంటూరు జిల్లాలోని ఒక మండలం, పల్నాడు ఒక్క మండలంలో వడగాడ్పులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.

వడదెబ్బ తగిలే అవకాశం ఉన్న కారణంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు వీలైనంత వరకు బయటకు రాకపోవడమే మంచిదని చెబుతున్నారు. ముసలివారు, చిన్న పిల్లలు బయటకు రావొద్దని సూచిస్తున్నారు. ఇదిలా ఉంటే నిన్న రాష్ట్రంలోనే అత్యధికంగా నంద్యాల 42 డిగ్రీలు, కర్నూలులో 41.9, కడప 41.2, అనంతపురం జిల్లాలో 40.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

TAGS