Mohammad Naseer : టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇష్టం.. నా అదృష్టం ఉంటే మంత్రిత్వ శాఖలో చోటు దక్కుతుందని గుంటూరు తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే మొహ్మద్ నసీర్ అన్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో విజయబావుటా ఎగరవేసిన టీడీపీ ఎమ్మెల్యే మొహ్మద్ నసీర్ గురువారం మొదటిసారిగా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇష్టం… నా అదృష్టం ఉంటే మంత్రిత్వ శాఖలో చోటు దక్కుతుందని వ్యాఖ్యానించారు. టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు.. సైనికుల్లా పనిచేయడం, జగన్మోహన్ రెడ్డి పాలనని ప్రజలు ఛీ కొట్టడంతో తమ పార్టీ భారీ మెజార్టీతో గెలిచిందని హర్షం వ్యక్తం చేశారు.
భారతీయ జనతాపార్టీని బూచిగా చూపించినప్పటికీ ముస్లింలు ఆలోచించి కూటమికి పట్టం కట్టారని కొనియాడారు. గుంటూరు నగరపాలక సంస్థలో అర్థరాత్రి అవినీతి ఫైళ్లు కదులుతున్నాయని, ఎక్కడ తేడా జరిగినా అధికారులతో పాటూ గత పాలకులు ఇబ్బందులు పడాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు మద్దిరాల మ్యానీ, చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు.