pity Jagan : ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పరిస్థితి దారుణంగా తయారైంది. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల్లో వైసీపీని దాని అధినేత జగన్మోహన్ రెడ్డిని గట్టిగా సమర్ధించేందుకు ఏర్పాటు చేసుకున్న సొంత మీడియా ఇంతకాలం ఆయనకు శల్యసారథ్యం చేస్తూ విజయవంతంగా ఎన్నికల్లో ఓడించింది. ఇప్పుడు ఆస్తుల వివాదంలో ఏదో చెప్పబోయి ధృతరాష్ట్రుడు, గాంధారి, దుర్యోధనుడు, యుద్ధం, సిద్దం, ఓటమి అంటూ అనకూడని మాటలనేసింది. అది చూసి జనాలు నవ్వుకుంటుంటే, జగన్ భజన చేసే అనుకూల మీడియా కంటతడిపెడుతుంది. చెల్లితో ఆస్తుల వివాదంలో చిక్కుకున్న జగన్ ఒంటరి పోరాటం చేస్తుంటే, లక్షలు జీతాలు తీసుకుంటున్న సొంత మీడియా తెలివితక్కువగా వ్యవహరిస్తోంది.. ఈ వ్యవహారంలో జగన్ చాలా న్యాయంగా ఉన్నారని తెలిసి ఉన్నప్పటికీ ఆయనని శత్రువుల బారి నుంచి కాపాడుకునే విధంగా వ్యవహరించడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. అసలు ఈ వ్యవహారంలో ఆస్తుల లెక్కల కంటే జగన్ నీతి నిజాయితీ, ఆయన భావోద్వేగాలను సొంత మీడియా ప్రజలకు అర్థమయ్యేలా వివరించలేకపోతోందని బాధపడుతోంది. షర్మిలకి మద్దతుగా విజయమ్మ లేఖ విడుదల చేసి జగన్‌ని కార్నర్ చేసినప్పుడు, సొంత మీడియా చేతులు ముడుచుకుని ప్రేక్షకపాత్ర పోషిస్తోందని జగన్ అనుకూల మీడియా బాధ పడుతోంది. అయితే జగన్ సొంత మీడియాని విమర్శిస్తూనే, వైసీపీ ఓ రాజకీయ పార్టీలా కాకుండా ఓ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలా నడుస్తోందంటూ విమర్శించడం విశేషం.
వైసీపీలో ఉన్నవారు కూడా తమ పార్టీని ఓ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగానే భావిస్తున్నారు. కనుక అందరూ లాభనష్టాల లెక్కలు మాత్రమే చూసుకుంటూ, పార్టీ, అధినేత ఏమైపోతే మాకేంటి అన్నట్లు వ్యవహరిస్తున్నారని జగన్ అనుకూల మీడియా వైసీపీ పరిస్థితికి అద్దం పట్టింది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రులు, నేతలు ఎవరినీ జగన్ దగ్గరకు రానీయలేదు. కనుక ఎవరూ ధైర్యం చేసి పిల్లి మెడలో గంట కట్టే ప్రయత్నం చేయలేదు. కానీ ఇప్పుడు సదరు జగన్ భజన మీడియా మాత్రం ధైర్యం చేసి పిల్లి మెడలో గంట కట్టేసింది. జగన్‌కి సామాజిక స్పృహ లేదని అభిప్రాయం వ్యక్తం చేసింది. వివిధ రంగాలకు చెందిన మేధావులతో తరచూ సమావేశమవుతూ తన పాలన గురించి వారి అభిప్రాయాలు తీసుకుంటూ, ఎప్పటికప్పుడు లోపాలు సరిచేసుకుంటూ ముందుకు సాగి ఉంటే ఉండి ఉంటే నేడు జగన్‌కి ఈ దుస్తితి ఏర్పడేది కాదని తేల్చి చెప్పేసింది. జగన్ కనీసం ప్రజల మధ్యకు వెళ్ళి వారిని కలిసేందుకు కూడా ఇష్టపడకుండా తాడేపల్లి ప్యాలస్‌లోనే కూర్చుని నష్టపోయారని, ఇంకా అలాగే ఉన్నారని, ఇలాగే ఉంటే జగన్ ఒంటరిగా మిగిలిపోతారని హితవు చెప్పింది సదరు జగన్ అనుకూల మీడియా.