IT Service Alliance : ప్రపంచంలోని పలు దేశాలు సేవారంగంలో దూసుకెళ్తున్నాయి. అభివృద్ధి చెందిన దేశాల్లో ముఖ్యంగా యూరప్, అమెరికా దేశాలు ఐటీ ఆధారిత రంగాల్లో ముందంజలో ఉన్నాయి. అందుకే అధిక ఆదాయ దేశాలుగా పిలువబడుతున్నాయి. సేవా రంగం లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తోంది. అలాగే మిగతా రంగాల కన్నా ఐటీ రంగమే భారీ వేతనాలను అందిస్తోంది.
దీంతో భారత్ వంటి దేశాల్లోని యువత అమెరికా, యూరప్ దేశాల్లో కొలువు కోసం కలల కంటున్నాయి. ఈ దేశాల్లో భారత యువతకు డిమాండ్ బాగానే ఉందని చెప్పవచ్చు. భారతీయుల కష్టించే తత్వం, నిజాయితీ, నిబద్ధత..ఏ దేశ సంస్థల నిర్వాహకులను అయిన అబ్బురపరుస్తుందని చెప్పడంలో సందేహం లేదు.
ఈక్రమంలో అమెరికాలోని ఫీనిక్స్ అరిజోనాలో ‘ఐటీ సర్వీస్ అలయన్స్’ పేరుతో ‘సినెర్జీ కిక్ఆఫ్’ మీటింగ్ నిర్వహించారు. స్థానికంగా ఉద్యోగాల కల్పన పెంచడం.. వినూత్న ఆవిష్కరణలకు పురికొల్పడం..ఈరంగంలో ఉన్న వ్యాపారులు, సేవాతత్పరులను ఎంకరేజ్ చేయడమే లక్ష్యంగా ఈ అలయెన్స్ ఏర్పాటు చేశారు.
ఐటీ రంగంలో కొత్త ఆవిష్కరణలు చేయాలని తపనతో ఉన్న యువతకు ఐటీ సర్వీస్ అలయన్స్ అండగా ఉంటుందని ఈ సందర్భంగా వక్తలు చెప్పారు. అమెరికాలో స్థానికంగా ఉద్యోగాల కల్పన పెంచడమే లక్ష్యంగా ఈ అలయన్స్ పనిచేయనుంది. ఈ సంస్థ కల్పించే అవకాశాలను యువత సద్వినియోగం చేసుకుని వారి భవిష్యత్ కు బంగారు బాట కల్పించుకోవాలని వక్తలు పిలుపునిచ్చారు. ఈ అలయన్స్ యువతకు ఓ రకంగా మార్గదర్శి అని చెప్పుకోవచ్చు.