JAISW News Telugu

AP State Bifurcation : రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు..ఏ నాయకుడూ పట్టించుకోరేమి?

State Bifurcation

AP State Bifurcation

AP State Bifurcation : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయి పదేళ్లు అవుతుంది. కానీ ఇంత వరకు రెండు రాష్ట్రాల్లో తేలని సమస్యలు ఎన్నో ఉన్నాయి. పునర్విభజన చట్టంలో పదేళ్లలో అన్ని సమస్యలు పరిష్కారమయ్యేలా వివాదాలు లేకుండా ఏర్పాట్లు చేశారు.  ఈ క్రమంలోనే ఉమ్మడి రాజధాని అంశాన్ని పదేళ్ల పాటు చేర్చారు. ఇప్పుడు జూన్‌ 2 నాటికి విభజన జరిగి పదేళ్లు పూర్తవుతుంది. అటు ఏపీలో ప్రస్తుతం ఆపద్ధర్మ ప్రభుత్వం ఉంది. సీఎం జగన్ కూడా విదేశాలకు వెళ్తున్నారు. ఆయన పట్టించుకునే పరిస్థితుల్లో అయితే లేరు. ప్రస్తుతం రేవంత్ రెడ్డిని కలవడానికి .. రెండు రాష్ట్రాల సమస్యల పరిష్కారం కోసం ఆయన ప్రయత్నించే అవకాశాలు కనబడడం లేదు.

ఇటు తెలంగాణ  సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. హైదరాబాదులో ఏపీకి కేటాయించిన భవనాలను స్వాధీనం చేసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఏపీ తెలంగాణ మధ్య పరిష్కారం కాని అంశాలపై చర్చించనున్నారు. ఈ నేపథ్యంలో 18న కేబినేట్ భేటీకి పిలుపునిచ్చారు. ఈ భేటీ ప్రధానంగా..తెలంగాణ, ఏపీ మధ్య పరిష్కారం కాని  అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. ఉద్యోగుల కేటాయింపు, ఆస్తులు, అప్పుల పంపిణీ సంబంధించిన అన్నింటిపై నివేదిక తయారు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం.. ఉద్యోగులు బదిలీ పూర్తి చేయాలని సూచించారు. రెండు రాష్ట్రాల మధ్య సమస్యాత్మకంగా మారిన అంశాలపై రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేలా తదుపరి కార్యాచరణ చేపట్టాలని అధికారులకు సీఎం సూచించారు.

వాస్తవానికి షెడ్యూల్ 9, 10 లోని సంస్థలు, కార్పొరేషన్లకు సంబంధించిన పంపిణీ ఇంకా పూర్తి కాలేదు. పలు అంశాలపై రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. విద్యుత్ సంస్థల బకాయిలు ఇంకా తేలలేదు. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల మధ్య ఉద్యోగుల కేటాయింపు, ఆస్తులు అప్పుల విభజన, ఇప్పటివరకు పరిష్కరించినవి, పెండింగ్లో ఉన్న అంశాలు తదితర వివరాలతో నివేదిక తయారు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఇకపై హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండదని, ఏపీకి కేటాయించిన భవనాలను జూన్ రెండు తర్వాత స్వాధీనం చేసుకోవాలని అధికారులను రేవంత్ రెడ్డి ఆదేశించారు. అలాగే.. రైతు రుణమాఫీ, ధాన్యం కొనుగోలు, రానున్న ఖరీదు పంటల ప్రణాళికపై కూడా చర్చించాలని సీఎం రేవంత్  నిర్ణయించారు. ఇప్పటి వరకు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్‌ జూన్‌ 2 తర్వాత తెలంగాణ రాష్ట్ర రాజధానిగా మారనుంది. పెద్దగా మార్పేమీ లేకపోయినా ఏపీకి కేటాయించిన భవనాలను తెలంగాణకు అప్పగించాల్సి ఉంది.

Exit mobile version