HCL company died : మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లోని ప్రముఖ ఐటీ కంపెనీ హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ కార్యాలయంలో 40 ఏళ్ల ఐటీ ఉద్యోగి గుండెపోటుతో మరణించాడు. కంపెనీ కార్యాలయంలోని వాష్‌రూమ్‌లో ఆయన విగత జీవిగా కనిపించారు. ఈ ఘటన శుక్రవారం జరిగిందని, మృతుడు హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ సీనియర్ విశ్లేషకుడు నితిన్ ఎడ్విన్ మైఖేల్‌గా గుర్తించామని పోలీసులు తెలిపారు. నితిన్ ఎడ్విన్ మైఖేల్ శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో మిహాన్ ప్రాంతంలోని హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ కంపెనీ కార్యాలయంలోని వాష్‌రూమ్‌కు వెళ్లాడని, ఆ తర్వాత అతని సహచరులు అపస్మారక స్థితిలో ఉన్నట్లు కనుగొన్నారని సోనెగావ్ పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు.
సహోద్యోగులు వెంటనే అతడిని నాగ్‌పూర్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)కి తరలించారు. అక్కడ అతను అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. సోనేగావ్ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి ప్రమాదవశాత్తు మృతిగా కేసు నమోదు చేశారు. ప్రాథమిక పోస్ట్‌మార్టం ఫలితాల్లో ఆ వ్యక్తి గుండెపోటుతో మరణించినట్లు తేలిందని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. అయితే అన్ని కోణాల్లో పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నట్లు వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మైఖేల్‌కు భార్య, ఆరేళ్ల కుమారుడు ఉన్నారు. విపరీతమైన పని ఒత్తిడి, వేర్వేరు ఉద్యోగ సమయాల కారణంగా ఐటీ ఉద్యోగులు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని వైద్యులు చెబుతున్నారు.
ఇటీవల లక్నోలోని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో పని ఒత్తిడితో ఓ మహిళా ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడింది. సదాఫ్ ఫాతిమా అనే ఉద్యోగి గోమతి నగర్‌లోని హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ విబూతి ఖండ్ శాఖలో అడిషనల్ డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్నారు. బ్యాంకు ఆవరణలో కుర్చీపై నుంచి జారిపడి ఫాతిమా మృతి చెందినట్లు పేరు చెప్పడానికి ఇష్టపడని సహచరులు తెలిపారు. ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు వైద్యులు తెలిపారు.