Jaggi Vasudev : తన కూతుళ్లను ఆశ్రమంలో అక్రమంగా నిర్భందించారని రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ కామరాజ్ ఈషా ఫౌండేషన్ పై హెబియస్ కార్పస్ పిటిషన్‌పై దాఖలు చేశారు. తన ఇద్దరు కుమార్తెలు గీతా కామరాజ్ (42), లతా కామరాజ్ (39)ను ఫౌండేషన్‌కు చెందిన కోయంబత్తూరు ఆశ్రమంలో అక్రమంగా నిర్బంధంలో ఉంచిందని పిటిషన్ లో వివరించాడు. దీనికి సంబంధించి దర్యాప్తు చేయాలని మద్రాస్ హైకోర్టు సోమవారం (సెప్టెంబర్ 30) కోయంబత్తూర్ రూరల్ పోలీసులను ఆదేశించింది. దీంతో దాదాపు 150 మంది పోలీసులు ఫౌండేషన్ లోకి వచ్చారు. గదులు, ఆవరణ, తదితరాలను పరిశీలించారు.
అయితే దీనిపై ఫౌండేషన్ స్పందించింది. ఈషా ఫౌండేషన్ ఎవరినీ వివాహం చేసుకోమని, చేసుకోవద్దని చెప్పదని అది వారి సొంత నిర్ణయం అని చెప్పింది. ఫౌండేషన్ లో కేవలం సన్యాసులు మాత్రమే కాదని, వివాహం చేసుకున్న వారు కూడా ఉన్నారన్నారు. అందరినీ ఈషా ఫౌండేషన్ సమానంగా చూస్తుందని పేర్కొంది. ‘యోగా, ఆధ్యాత్మికత అందించేందుకే సద్గురు జగ్గీ వాసుదేవ్ ఫౌండేషన్ ను స్థాపించారని, మేజర్లు అయిన వారికి వారి మార్గాన్ని ఎంచుకునే స్వేచ్ఛ, జ్ఞానం ఉంటుందని మేము విశ్వసిస్తామని, ఇవి వ్యక్తిగత నిర్ణయాలు కాబట్టి అందులో తమ ప్రమేయం ఉండదన్నారు.
తన కూతుళ్లను కోర్టు ఎదుట హాజరుపరచాలని పిటిషనర్ కోరారు. ఈ మేరకు వారు కోర్టు ఎదుటకు వచ్చారు. సన్యాసం తీసుకోవడం తమ సొంత నిర్ణయం అని ఇందులో ఎలాంటి ఒత్తిడి లేదని వివరించారు. తాము సన్యాసం తీసుకొని ఈషా సెంటర్ లో ఆశ్రయం పొందుతున్నామని కానీ తమను ఎవరూ బంధించలేదని కోర్టుకు చెప్పారు. ఈ నేపథ్యంలో నిజం గెలుస్తుందని తాము ఆశిస్తున్నాము. ఫౌండేషన్ పై వచ్చిన వివాదాలకు ముగింపు ఉంటుంది.’ అని ఈషా ఫౌండేషన్ పేర్కొంది.