YCP : వైసీపీ అత్యుత్సాహం మళ్లీ బెడిసి కొట్టబోతోందా..?
YCP : ఏపీ ముఖ్యమంత్రి జగన్‌పై జరిగిన రాళ్ల దాడిని వైసీపీ విస్తృతంగా ప్రచారం చేసుకుంటోంది. దాని నుంచి సింపతీ కొట్టేసి రాజకీయ మైలేజీకి వాడుకోవాలని వైసీపీ ప్రయత్నిస్తున్నట్లు స్పష్టం అవుతోంది. అయితే, దాని అత్యుత్సాహంతోటే ఎదురుదెబ్బ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి.
కొన్ని రోజుల క్రితం వలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీ వ్యవహారంలో కూడా వైసీపీ ఇలాంటి అత్యుత్సాహమే చూపించింది. ఆ సమయంలో టీడీపీ దానిని ధీటుగా ఎదుర్కోవడంతో ప్లాన్ వర్కవుట్ కాలేదు. అందుకే వలంటీర్ల వ్యవహారంపై వైసీపీ నేతలు సైలంట్ అయిపోయినట్లు కనిపిస్తోంది.
ఇప్పుడు జగన్‌పై దాడి కూడా వైసీపీ తీరు చీకట్లో రాయి విసిరిన్నట్లే ఉందని చెప్పవచ్చు. ఈ ఘటనపై వైసీపీ అత్యుత్సాహం ప్రదర్శిస్తుండడంతో ప్రజలకు దానిపై సానుభూతి బదులు అనుమానాలు కలిగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నట్లు లేదు.
మరోపక్క టీడీపీ సీనియర్ నాయకులు మీడియా ముందుకు వచ్చి ఇది ‘కోడికత్తి 2.0 వెర్షన్’ అని ఎదురుదాడికి దిగుతున్నారు. దాడికి సంబంధించి అనేక ప్రశ్నలు సంధించి వైసీపీని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. సీఎంపై దాడి జరిగితే డీజీపీ, ఇంటలిజన్స్ అధిపతులు బాధ్యత వహించరా..? అని నిలదీస్తున్నారు.
టీడీపీ+జనసేన+బీజేపీ సభలో ప్రధాని మోడీ పాల్గొన్నప్పుడే భద్రతా వైఫల్యాలు ఏర్పడ్డాయని కేంద్ర హోం శాఖ ఆగ్రహంగా ఉంది.
రాష్ట్రంలో డీజీపీతో పాటు 22 మంది పోలీస్ ఉన్నతాధికారులపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. దానిపై విచారణ జరుపుతోంది కూడా.
ఈ నేపథ్యంలో వైసీపీ పాలనలోనే సీఎం జగన్మోహన్ రెడ్డిపై దాడి రాష్ట్రంలోని పరిస్థితులకు అద్దం పడుతున్నట్లే కనిస్తుందని కొంత మంది విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్ ఈ ఘటనను భద్రతా వైఫల్యంగానే భావించి ఎన్నికల సంఘాన్ని వివరణ కోరింది. దగ్గుబాటి రాసిన లేఖ ఇప్పటికే ఈసీ చేతిలో ఉంది. కనుక ఈ వైఫల్యాలకు ఆమె లేఖలో పేర్కొన్నవారే కారణమని భావిస్తే ఏమవుతుందో ఊహించుకోవచ్చు.
కానీ, వైసీపీ ఇదంతా గమనించకుండా విస్తృతంగా ప్రచారం చేసుకోవడం చూస్తే తన వేలితో తన కన్నే పొడుచుకోవడంగానే చెప్పవచ్చు. ఈ ఘటనతో సానుభూతి ఓట్లు సంపాదించుకోవాలనే తాపత్రయంతో కేంద్రానికి, కేంద్ర ఎన్నికల కమిషన్‌కు తప్పుడు సంకేతాలు పంపిస్తున్నామని, దీని పర్యావసానాలు, ఏ విధంగా ఉండబోతాయో వైసీపీ గ్రహించిన్నట్లు లేదు. కనుక ఈ వ్యవహారంలో వైసీపీ అత్యుత్సాహంతో ఆశించిన ఫలితాలు రాకపోగా ఊహించని ఎదురుదెబ్బ తగిలే అవకాశం కనిపిస్తోంది.