YCP – Kutami : ఏపీలో కూటమి అధికారంలోకి రాగానే గత ఐదేళ్లుగా నోటికి హద్దూ అదుపు లేకుండా వాగిన ప్రతి ఒక్కరి మీద చట్ట పరంగా చర్యలుంటాయని, అన్ని రెడ్ బుక్ లో నమోదు చేశామని.. ఈ ఐదేళ్లు వైసీపీ విధ్వంసం ఫలితంగా కారిన ప్రతి కన్నీటి బొట్టుకు న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు నారా లోకేష్.
అధికారాన్ని అడ్డుపెట్టుకొని వైసీపీ చేసిన అరాచకాలను గుర్తుపెట్టుకోండి.. వచ్చేది మన ప్రభుత్వమే ప్రతి ఒక్కరి లెక్కా సరిచేద్దాం అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా పార్టీ కేడర్ కు, వైసీపీ అరాచక బాధితులకు భరోసా ఇచ్చారు. అన్యాయంగా తనను జైలుకు పంపి 40 ఏళ్ల రాజకీయ జీవితంపై మచ్చ వేసిన ప్రతీ వైసీపీ నాయకుడికి వారికి సహకరించిన ప్రతీ అధికారిపై విచారణ ఉంటుందనే నమ్మకాన్నిచ్చారు బాబు.
అనుకున్నట్టే ప్రజలు వైసీపీని ఛీ కొట్టి కూటమికి జై కొట్టారు. కానీ కూటమి ప్రజలకు ఇచ్చిన మాట.. పార్టీ కేడర్ కు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోతుంది. ఇప్పటికీ వైసీపీనే అధికారంలో ఉంది అనేలా వైసీపీ నాయకుల నోర్లు మూత పడడం లేదు. వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ నాయకుడు చేసిన చిన్న పొరపాటును కూడా పెద్దగా ఫోకస్ చేసి ప్రజల ముందు దోషిగా నిలబెట్టారు.
రూ. 2 లక్షల విలువైన ఫర్నీచర్ ను దొంగలించిన కోడెల శివ ప్రసాద్ అంటూ ఆయనను అవమానించి చనిపోయే వరకు వేధించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ. 35 లక్షల విలువైన ఫర్నీచర్ జగన్ తాడేపల్లి ప్యాలస్ లో ఉంచుకున్నా, రూ. 500 కోట్లతో రుషికొండపై విలాసవంతమైన ప్యాలసులు నిర్మించుకున్నా చర్యలు తీసుకోలేకపోయారు.
అధికార పార్టీపై ఒక చిన్న విమర్శ చేసినా, వారి అధినేతను ఒక్క ప్రశ్న వేసినా ఉపేక్షించేది లేదని కేసులు పెట్టి వేధించిన వైసీపీ ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి మళ్లీ అదే నోటి దూల కొనసాగిస్తుంది. దీంతో ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉంది కూటమినా? వైసీపీ ప్రభుత్వమా.? అంటూ ప్రజలు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
జగన్ నుంచి పేర్నినాని వరకు అహంకారం పోలేదు. సొంత పార్టీ కార్యకర్తలే జగన్ కు వ్యతిరేకంగా నినదిస్తున్నా వైసీపీ నేతలకు తత్త్వం బోధపడలేదు. ఈ నోటి దురుసుతోనే అధికారం దూరమైందన్న వాస్తవం గ్రహించలేకపోతున్నారు. ప్రతిపక్ష హోదా ఉండాలన్న ప్రజల తీర్పును గౌరవించకుండా జగన్ అధికార పార్టీకి, స్పీకర్ కు డిమాండ్లతో కూడిన లేఖ రాశారు.
జగన్ చేసిన తప్పులు మోసేందుకే నా జీవితం అని బతుకుతున్న పేర్నినాని మీడియా ముందుకు వచ్చి జగన్ ప్యాలసుల పిచ్చిని వెనకేసుకువస్తూ.. చంద్రబాబుపై నోరు పారేసుకున్నారు. నన్ను తిడితే మా పార్టీ కేడర్ కు బీపీలు వస్తాయి, అలా వస్తే ఎంతటి విధ్వంసానికైనా వెనకాడరు అంటూ హింసను ప్రేరేపిస్తూ జగన్ ఇప్పుడు తన నేతలను మీడియా ముందుకు పంపి ఎవరిని రెచ్చకొట్టాలనేది చూస్తున్నారు.? ఎవరికీ బీపీలు రావాలని వారు కోరుకుంటున్నారు.?
జగన్ మాదిరే బాబు కూడా మా పార్టీ క్యాడర్ కు బీపీలు వస్తాయి మీ పార్టీ నేతల మీద దాడులు చేస్తారు అంటూ ఒక్క ప్రకటన చేస్తే వైసీపీ నేతల పరిస్థితి ఏంటి.? పదవి పోయినా.., ప్రభుత్వం మారినా.. వైసీపీ నేతల బుద్ధి మారడం లేదు. బాబు, పవన్ కూడా గతంలో మాదిరే జగన్ ను, వైసీపీ ని తక్కువ అంచనా వేసి వారి మానానికి వారిని వదిలేస్తే జగన్ మళ్లీ తన కుయుక్తులకు పదును పెట్టడం ఖాయం.