Vangaveeti Radha : ఏపీలో వంగవీటి రాధా పోటీ చేస్తున్నారా? పోటీ చేస్తే ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు? ఏ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతారు? అనే విషయాలపై ఆయన అనుచరుల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. తాజాగా ఆయన జనసేన నేతలైన బాలశౌరి, నాదెండ్లను కలువడంతో ఆ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అవనిగడ్డ నుంచి పోటీ చేయడానికి ఆయన రెడీగా ఉన్నారని కూడా వార్తలు వచ్చాయి.
ప్రస్తుతానికి టీడీపీలో ఉన్న వంగవీటి రాధా టికెట్ దక్కుతుందని గంపెడు ఆశలు పెట్టుకోగా చివరకు నిరాశే మిగిలింది. విజయవాడ సెంట్రల్, విజయవాడ తూర్పు నియోజకవర్గాల్లో ఏదో ఒక నియోజకవర్గం తనకు కేటాయిస్తారని ఆయన, ఆయన అనుచరులు భావించారు. అయితే ఈ రెండు నియోజకవర్గాల్లో రాధాను పక్కనపెట్టి ఇతరులను చంద్రబాబు ప్రకటించారు. దీంతో ఆయన టీడీపీని వీడి వైసీపీలోకి చేరుతున్నారనే ప్రచారం జరిగింది.
వైసీపీలో చేరితే మచిలీపట్నం పార్లమెంట్ స్థానాన్ని ఇస్తామని రాధాకు ఆఫర్ చేసినట్టు వార్తలు వచ్చాయి. అయితే రాధా వైసీపీలోకి వెళ్లడానికి పెద్దగా ఆసక్తి చూపడంలేదు. తాజాగా రాధా టీడీపీని వీడి పవన్ జనసేనలో చేరడానికి రెడీ అవుతున్నారని సమాచారం. ఈమేరకు మచిలీపట్నం ఎంపీ బాలశౌరి, నాదెండ్లతో ఆయన చర్చలు జరిపినట్లు సమాచారం.
బాలశౌరి ఇటీవల అధికార వైసీపీని వీడి జనసేనలో చేరారు. ఆయన వచ్చే ఎన్నికల్లో మచిలీపట్నం జనసేన అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. దీంతో ఎలాగైనా రాధాను జనసేనలోకి తీసుకురావడానికి బాలశౌరి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ తర్వాత నాదెండ్లను కూడా కలిశారు. దీంతో ఆయనకు అవనిగడ్డ సీటు ఇస్తున్నారని, అక్కడి నుంచి పోటీ చేయబోతున్నారని వార్తలు వెల్లువలా వచ్చాయి. అయితే ఇప్పటివరకూ ఈ విషయంపై జనసేన నేతలు కానీ, వంగవీటి రాధా కాని ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. దీంతో అసలు రాధా పోటీ చేస్తారా? లేదా అనే దానిపై ఎవరికీ అంతుచిక్కడం లేదు.