Neelam Sanjeeva Reddy : నీలం సంజీవరెడ్డి.. ఈ పేరు తెలుగు చరిత్ర ఉన్నంత కాలం పదిలంగా ఉంటుంది. భారత రాష్ట్రపతిగా ఏకగ్రీవంగా ఎన్నికైన ఒకే ఒక్కడు డాక్టర్ నీలం సంజీవరెడ్డి. చరిత్రలోనూ, భవిష్యత్ లోనూ ఏ తెలుగువాడికి సాధ్యం కానీ విధంగా రాష్ట్రపతిగా, లోక్ సభ స్పీకర్ గా, కేంద్రమంత్రిగా, ముఖ్యమంత్రిగా, ఉపముఖ్యమంత్రిగా పనిచేసిన ఘనత ఆయనదే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిగా నీలం సంజీవరెడ్డి చరిత్రలో నిలిచి ఉంటారు. తెలుగు ప్రజానీకం మరిచిపోలేని, చిరస్మరణీయ వ్యక్తి నీలం.
ప్రస్తుతం ఒక్క సారి ముఖ్యమంత్రి అయితే వేలకోట్లు సంపాదించే రాజకీయ నాయకులు ఉన్నారు. రాష్ట్ర స్థాయి నుంచి దేశ అత్యున్నత పదవి చేపట్టిన నీలం సంజీవరెడ్డి..ఎలాంటి హంగు ఆర్భాటాలకు పోకుండా నిస్వార్థంగా సేవలు అందించారు. రాజకీయాల్లో తన వారసత్వాన్ని సైతం ఆయన ఒప్పుకోలేదు. ప్రత్యేక ఆంధ్ర ఉద్యమంలోనూ, తెలంగాణతో కూడిన ఆంధ్రప్రదేశ్ అవతరణలోనూ సంజీవరెడ్డిదే కీలకపాత్ర. ఏపీ రాజకీయాలను, దేశ రాజకీయాలను శాసించిన వ్యక్తి నీలం సంజీవరెడ్డి.
అలాంటి సంజీవరెడ్డి గారిని మనం ఎంతగా గౌరవించాలి. అంతటి గొప్ప మనిషి గురించి నేటి తరానికి తెలియజేయకూడదా? మరి మన ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి. ఆయన జయంతి, వర్ధంతిని అధికారికంగా నిర్వహిస్తున్నాయా? ఆయన విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారా? కనీసం ఉన్న విగ్రహాలను కాపాడుతున్నారా? అనే ప్రశ్నలకు ఈ పాలకులు సమాధానం చెప్పాలి.
నీలం సంజీవరెడ్డి వర్ధంతి జూన్ 1వ తేదీ. గతంలో సచివాలయం దగ్గరలో ఉన్న విగ్రహానికి నివాళులు అర్పించేవారు. ఆయన కుటుంబ సభ్యులు కుమార్తె డాక్టర్ కె.వి కృష్ణకుమారి, మనవడు డాక్టర్ నీలం రమణారెడ్డి, డాక్టర్ పద్మిని దంపతులు తదితరులు నీలం విగ్రహానికి జయంతి, వర్ధంతి కార్యక్రమాలకు సెక్రటేరియట్ వద్ద నివాళి అర్పించేవారు. కానీ ఈ మధ్యకాలంలో సెక్రటేరియట్ దగ్గరలో ఉన్న ఆ మహనీయుని విగ్రహం అదృశ్యమైంది. దేశానికి, రాష్ట్రానికి గణనీయమైన సేవలు అందించిన ఆ నిరుపమాన, నిష్కళంక త్యాగధనుని జయంతి మే 19వ తేదీ, వర్ధంతి జూన్ 1..ఇలాంటి సందర్భాలలోనైనా ఆయన్ను కనీసం స్మరించుకోవటం, హృదయాంజలి ఘటించుకోవటం మన కనీస ధర్మం కాదా? అని ఆయన కుటుంబ సభ్యులు ప్రస్తుత పాలకులను ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా నీలం సంజీవరెడ్డి గారి విగ్రహాన్ని ఆవిష్కరించి ప్రజలకు ఆయన్ను స్మరించుకునే అవకాశం కల్పించాలని కోరుతున్నారు.