AP BJP : ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా కలిసి పోటీ చేస్తున్నాయి. దీంతో మూడు పార్టీల జెండా, అజెండా ఒక్కటే. రాష్ట్రంలో వైసీపీ పాలనకు చరమగీతం పాడటం. కానీ ఆచరణలో టీడీపీ, జనసేనకు ఆశించిన మేర బీజేపీ సహకారం అందించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఈనేపథ్యంలో వీరి మైత్రిపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. వీరి బంధం కడదాకా నిలుస్తుందా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
వైఎస్ జగన్ పాలనలో అరాచకాలకు అంతేలేదు. అవి ప్రత్యక్షంగా చూశారు కూడా. పుంగనూరులో జరిగిన దాడులు, పల్నాడులో కొనసాగిన ఉద్రిక్తతలు, రాష్ట్రంలో గోవా మద్యం డంపులు దొరుకుతున్నా ఎన్నికల సంఘం నోరు మెదపడం లేదు. కేంద్రం కనుసన్నల్లో పనిచేసే ఎన్నికల సంఘం ఏపీలో జగన్ అరాచకాలను ఎందుకు అడ్డుకోలేకపోతున్నారు. ఎందుకు కొరఢా ఝుళిపించడం లేదు అనే అనుమానాలు అందరిలో వస్తున్నాయి.
ఇక అధికార యంత్రాంగం అయితే మొత్తం జగన్ అదుపులోనే ఉంది. సీఎస్ నుంచి డీజీపీ వరకు వారు చెప్పిందే వేదంలా నడిపిస్తున్నారు. దీంతో రాష్ట్రంలో పరిపాలన సాగుతుందా అనే సందేహాలు అందరిలో వస్తున్నాయి. వీటిని ఖండించాల్సిన కేంద్రం చోద్యం చూస్తోందని అంటున్నారు. బీజేపీ తీరును తప్పుబడుతున్నారు. వైసీపీకే వంత పాడుతున్నారనే విమర్శలు మూటగట్టుకుంటోంది.
అధికారులను బదిలీ మాత్రం చేస్తున్నారు కానీ శాంతిభద్రతల విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడం లేదు. జనసేన పార్టీకి కేటాయించిన గాజు గ్లాస్ గుర్తు విషయంలో కూడా ఎన్నికల సంఘం జనసేన మాట పట్టించుకోవడం లేదు. జనసేన పోటీలో లేని ప్రాంతాల్లో ఇతరులకు ఆ గుర్తు కేటాయిస్తున్నారు. దీంతో టీడీపీకి చెక్ పడే అవకాశాలున్నాయని అంటున్నారు. ఇలా ఎన్నికల సంఘం ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తుందని కూటమి ఆందోళన చెందుతోంది.
ఈ క్రమంలో రాష్ట్రంలో బీజేపీ కూటమి కోసం పనిచేస్తోందా? లేక జగన్ కోసం నిర్ణయాలు తీసుకుంటుందా అనే కోణంలో అనుమానాలు వస్తున్నాయి. కూటమి పార్టీలకు మద్దతు ఇవ్వాల్సింది పోయి ప్రతిపక్ష పార్టీకి మద్దు ఇచ్చేలా వ్యవహరించడంతోనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.