Deputy CM : అసలు రాజ్యాంగంలో డిప్యూటీ సీఎం పదవి ఉందా.. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ?
Deputy CM : ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువైంది. జూన్ 12న గన్నవరం సమీపంలోని కేసరపల్లిలో జరిగిన ఏపీ రాష్ట్రమంత్రి వర్గ ప్రమాణస్వీకారం పూర్తయింది. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ ప్రమాణ స్వీకారం చేశారు. అయితే, ఆయన మంత్రిగా మాత్రమే ప్రమాణం చేశారు. తాజాగా ఆయనకు మంత్రిత్వ శాఖలను కేటాయించారు. ఇందులో ఆయనను డిప్యూటీ సీఎంగా పేర్కొంటూ పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల బాధ్యతలను తనకు అప్పగించారు. అయితే, ప్రస్తుతం అందరూ పవన్ కల్యాణ్ వేదిక మీద ఉపముఖ్యమంత్రిగా ఎందుకు ప్రమాణస్వీకారం చేయలేదని చర్చించుకోవడం మొదలు పెట్టారు. దీనిపై అసలు రాజ్యంగంలో డిప్యూటీ సీఎం పదవి ఉందా అన్న సందేహాలు తలెత్తాయి. గతంలో డిప్యూటీ సీఎం పదవిపై సుప్రీం కోర్టు ఏం చెప్పిందో చూద్దాం.
ప్రస్తుతం దేశంలోని 14 రాష్ట్రాల్లో 23 మంది డిప్యూటీ సీఎంలు ఉన్నారు. తాజాగా ఏపీలో పవన్ కల్యాణ్ కి డిప్యూటీ సీఎం పదవి వరించింది. ఈ నేపథ్యంలో ఈ రాజ్యంగంలో ఈ పదవి ఉందా.. రాజ్యాంగంలోని 163, 164 అధికరణలు ముఖ్యమంత్రి, మంత్రివర్గానికి సంబంధించిన నిబంధనలను తెలియజేస్తాయి. ఆర్టికల్ 163(1) ప్రకారం గవర్నర్‌కు సలహా ఇచ్చేందుకు సీఎం నేతృత్వంలో మంత్రివర్గం ఉంటుంది. ముఖ్యమంత్రిని గవర్నర్ నియమిస్తారని, మంత్రివర్గాన్ని కూడా ముఖ్యమంత్రి సలహా మేరకే గవర్నర్ నియమిస్తారనే నిబంధన అయితే ఉంది. అయితే ఈ రెండు పేరాల్లో డిప్యూటీ సీఎం పదవి ప్రస్తావన అనేది మాత్రం లేదు. రాష్ట్రంలో కేబినెట్ మంత్రితో సమానంగా డిప్యూటీ సీఎం పదవిని పరిగణిస్తారు. కేబినెట్ మంత్రికి లభించే జీతం, సౌకర్యాలే డిప్యూటీ సీఎంకు కూడా అందుతాయి.
ఈ ఏడాది ఫిబ్రవరి 12న సుప్రీంకోర్టు డిప్యూటీ సీఎం నియామకంపై తీర్పు వెలువరించింది. డిప్యూటీ సీఎం పదవి రాజ్యాంగ విరుద్ధం కాదని చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన బెంచ్ స్పష్టం చేసింది. వాస్తవానికి ప్రజా రాజకీయ పార్టీ అనే సంస్థ డిప్యూటీ సీఎంల నియామకాలు రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. రాజ్యాంగంలో డిప్యూటీ సీఎం లాంటి పదవి లేదని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 (సమానత్వ హక్కు)ని ఉల్లంఘిస్తుందని ఈ పిటిషన్‌ను తోసిపుచ్చిన చీఫ్ జస్టిస్ చంద్రచూడ్.. డిప్యూటీ సీఎం పదవి అనేది ఒక పదవి అని, అది రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించదని అన్నారు. డిప్యూటీ సీఎం కావడం వల్ల ఎలాంటి ప్రత్యేక సౌకర్యాలు లేదా అధిక జీతం లభించదని ఆయన వెల్లడించారు. డిప్యూటీ సీఎం పదవి రాజ్యాంగ ఉల్లంఘన కాదని సుప్రీంకోర్టు స్ఫష్టం చేసింది.