YCP Manifesto : వైసీపీ మ్యానిఫెస్టో అసలు ఉంటుందా? ఉండదా?
YCP Manifesto : ఎన్నికల మ్యానిఫెస్టో అనేది పార్టీలకు ఒక రాజ్యాంగం వంటిది. అధికారంలోకి వస్తే ప్రజలకు తామేం చేస్తామో చెప్పే కరదీపిక వంటిది. ప్రజలకు ఇచ్చే ప్రమాణ పత్రమది. పార్టీలు ప్రకటించే మ్యానిఫెస్టోలను విశ్లేషించుకుని ప్రజలు తమ ఓటును వేస్తారు. అయితే మ్యానిఫెస్టోలను పూర్తిస్థాయిలో అమలు చేస్తారా? చేయరా? అనేది తర్వాత విషయం. కానీ ఎన్నికల్లో ప్రజలు ఆదరించాలంటే కచ్చితంగా మ్యానిఫెస్టో ఉండాల్సిందే. హామీ ఇచ్చిన మ్యానిఫెస్టోను ఏపార్టీ అమలు చేస్తుందని నమ్ముతారో ఆ పార్టీకే జనాలు ఓటేస్తారు.
కేంద్రంలో బీజేపీ రెండు సార్లు అధికారంలోకి వచ్చిందంటే ఆ పార్టీ మ్యానిఫెస్టో పాత్ర తక్కువేమి కాదు. రామాలయం, 370 ఆర్టికల్ రద్దు..ఇలా ఎన్నో జనాకర్షక హామీలు అందులో ఉన్నాయి. మొన్నటికి మొన్న తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి కారణం ఆ పార్టీ మ్యానిఫెస్టోలో ప్రకటించిన ఆరు గ్యారెంటీలే. అందుకే పార్టీలకు ఎన్నికల మ్యానిఫెస్టో అత్యంత కీలకం. పార్టీ గెలవాలన్నా, ఓడాలన్నా మ్యానిఫెస్టోను బట్టే ఉంటుంది.
ఏపీలో మరో రెండు నెలల్లోనే ఎన్నికలు ఉన్నాయి. అధికార వైసీపీ మాత్రం ఇప్పటికీ మ్యానిఫెస్టో ప్రకటించలేదు. నిన్న జరిగిన రాప్తాడు సిద్ధం సభలో అధినేత జగన్ తమ మ్యానిఫెస్టో ప్రకటిస్తారని భావించారు. కానీ ఆయన మ్యానిఫెస్టో సంగతి దేవుడెరుగు..ప్రసంగమంతా చంద్రబాబును తిట్టడానికే కేటాయించారు. ఆయన మ్యానిఫెస్టో గురించి చెప్పకుండా చంద్రబాబు ప్రకటించిన ‘సూపర్ సిక్స్’ హామీలపై విరుచుకుపడ్డారు. చంద్రబాబు గతంలో 1995 నుంచి 3 సార్లు సీఎం పదవి చేపట్టిన ఆయన హామీ ఇచ్చిన వాటిలో పది శాతం కూడా అమలు చేయలేదని ఆరోపించారు.
మరి చంద్రబాబు హామీలను ఎండగడుతున్న జగన్ రెడ్డి.. తాను మరచిపోయిన హామీల సంగతి పక్కనపెట్టారు. ఎన్నికలు సమీపిస్తున్న మ్యానిఫెస్టో ప్రకటించకుండా.. మరోసారి గెలిస్తే ప్రజలకు ఏం చేస్తామో చెప్పకుండా దాటవేస్తున్నారు. కొత్త పథకాలు ఏవైనా ఉంటాయా? డ్వాక్రా రుణాల మాఫీ ఉంటుందా? నిరుద్యోగులకు ఏమైనా హామీలు ఉంటాయా? రాజధాని విషయంలో అసలు ఏం చేయబోతున్నారు? ఇలా ఎన్నెన్నో సందేహాలు జనాల్లో ఉన్నాయి.
వీటన్నంటిపై వైసీపీ వైఖరి ఏంటి? ఆ పార్టీ మ్యానిఫెస్టో ఏంటి? అని జనాలు ఎదురుచూస్తున్నారు. మ్యానిఫెస్టోను అమలు చేస్తారా? చేయరా అనేది వేరే విషయం. తన మ్యానిఫెస్టోను ప్రకటించకుండా..ఇతరుల మ్యానిఫెస్టో పై విరుచుకుపడడం సమంజసం కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.