Team India Coach : టీమ్ ఇండియాకు త్వరలో చీఫ్ కోచ్ ను ఎంపిక చేయనున్నారు. ఈ కోచ్ పదవి కోసం ఐదుగురు క్రికెట్ దిగ్గజాలు పోటీ పడుతున్నారు. గత ఏడాది జరిగిన వన్డే ప్రపంచకప్‌లో రాహుల్ ద్రవిడ్ సారథ్యంలోని భారత జట్టు ఫైనల్‌కు చేరుకుంది. అంతకు ముందు జరిగిన టీ20 ప్రపంచకప్‌లో సెమీఫైనల్‌లో ఓటమి చవి చూసింది. ప్రస్తుత చీఫ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కాంట్రాక్ట్ త్వరలో ముగియనుంది. ప్రస్తుతం టీమ్ ఇండియా తదుపరి ప్రధాన కోచ్ ఎవరు? అనే చర్చ జోరుగా సాగుతున్నది. కొత్త కోచ్ నియామకానికి త్వరలో ప్రకటన విడుదల చేయనున్నట్లు బీసీసీఐ కార్యదర్శి జై షా ప్రకటించారు. 2024 టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్ తర్వాత రాహుల్ ద్రవిడ్ కోచ్ పదవీకాలం ముగియనుంది. ఆ తర్వాత భారత జట్టుకు కొత్త కోచ్ వచ్చే అవకాశాలు ఉన్నట్లు షా ప్రకటనతో స్పష్టమైంది.
హెడ్ కోచ్ రేసులోని క్రికెట్ దిగ్గజాలు వీరే..
టీమిండియా సొగసరి బ్యాట్స్ మెన్, ఎన్‌సీఏ చీఫ్ వీవీఎస్ లక్ష్మణ్ ప్రధాన కోచ్ రేసులో ముందు ఉన్నట్లు తెలుస్తున్నది. గతంలో రాహుల్ ద్రవిడ్ గైర్హాజరుతో బీసీసీఐ అతడికి ప్రధాన కోచ్ బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే.
ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ జస్టిన్ లాంగర్ కూడా టీమిండియా ప్రధాన కోచ్ పదవికి దరఖాస్తు చేసుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
ఆస్ట్రేలియా మాజీ ఆల్ రౌండర్ టామ్ మూడీ కూడా ప్రధాన కోచ్ పదవికి రేసులో ఉన్నారు. మూడీ ఇంతకు ముందు శ్రీలంక జట్టుకు కోచ్ గా బాధ్యతలు నిర్వర్తించారు.
ప్రపంచకప్‌లో ఆఫ్ఘనిస్థాన్ జట్టుకు మెంటార్‌గా వ్యవహరించిన అజయ్ జడేజా కూడా టీమిండియా కోచ్ పదవికి రేసులో ఉన్నాడు. అయితే జడేజాను ఎంపిక చేసే అకాశాలు అంతగా కనిపించడం లేదు. కానీ వన్డే ప్రపంచకప్‌లో అజయ్ జడేజా సారథ్యంలోని అఫ్గానిస్థాన్ జట్టు అద్భుతంగా రాణించింది.
గుజరాత్ టైటాన్స్ ప్రధాన కోచ్ ఆశిష్ నెహ్రా కూడా టీమిండియా కోచ్ పదవికి రేసులో ఉన్నాడు. అతని మార్గదర్శకత్వంలో గుజరాత్ టైటాన్స్ జట్టు ప్రారంభంలోనే ఛాంపియన్‌గా అవతరించింది. గత సీజన్‌లో అద్భుతంగా రాణించినప్పటికీ రన్నరప్‌గానే నిలిచింది. జట్టులో ప్రధాన ఆటగాళ్లు లేకపోయినా ఈసారి కూడా గుజరాత్ టైటాన్స్ మంచి ప్రదర్శన ఇస్తు్న్నది.