Kadapa-YCP : కడప గడప నుంచే వైసీపీ పతనమా?

Kadapa-YCP

Kadapa-YCP

Kadapa-YCP : ఈ సారి (2024) ఎన్నికల్లో వైసీపీ అసెంబ్లీలో 175, పార్లమెంట్ లో 25 సీట్లు గెలుచుకుంటుందని పోలింగ్ కు ముందు వరకు ధీమాగా చెప్పిన సీఎం జగన్మోహన్ రెడ్డి మర్నాటి (మే 14) నుంచి 175 పదం ఉచ్చరించకుండా గత ఎన్నికల కంటే ఎక్కువ సీట్లు గెలుస్తామని ప్రకటన చేశారు. జగన్ ప్రకటనతో ఈసారి వైసీపి ఓటమి తధ్యం.. అది కూడా వైసీపి, వైఎస్సార్ కుటుంబానికి కంచుకోటగా ఉన్న కడప నుంచే మొదలయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ఈ సారి కడపలో వైసీపీ ఓడిపోతే ఆ క్రెడిట్ లో సింహభాగం వైఎస్ షర్మిలకే దక్కుతుందని చెప్పవచ్చు. ఈ క్రెడిట్ ఆమె ఒక్కరికే కాదు.. ఇంకా చాలా మంది ఖాతాలో పడుతుంది. ఆమెను గెలిపించమని ప్రజలను కోరినందుకు జగన్ తల్లి విజయమ్మకు, ఆమెకు మద్దతుగా నిలిచి అవినాష్ రెడ్డితో యుద్ధం చేసిన సునీతా రెడ్డికి, తనతో పోరాడేందుకు అవకాశం కల్పించిన అవినాష్ కు, జగన్మోహన్‌ రెడ్డికి కూడా వైసీపీ ఓటమి క్రెడిట్ లభిస్తుంది.

ఈ సారి కడప జిల్లాలో కడప, రాజంపేట, కమలాపురం, జమ్మలమడుగు, రాయచోటి, ప్రొద్దుటూరు, రైల్వేకోడూరు, మైదుకూరు నియోజకవర్గాల్లో వైసీపీ, కూటమికి మధ్య హోరాహోరీ పోటీ జరిగింది. పులివెందుల, బద్వేల్ నియోజకవర్గాల్లో వైసీపీకి ఏకపక్షంగా ఓటింగ్ జరిగిన్నట్లు తెలుస్తోంది. కడప కంచుకోటలో వైసీపీకి ఎదురుగాలి వీయడంను విశ్లేషిస్తే ఒక్కో నియోజకవర్గంలో ఒక్కోటి కారణంగా కనిపిస్తోంది.

కడప : ఈ నియోజకవర్గం టికెట్ సిట్టింగ్ ఎమ్మెల్యే, జగన్ సన్నిహితుడు అంజాద్ బాషాకు కేటాయించింది వైసీపీ. అయితే అంజాద్ బాషాతో పాటు ఆయన తమ్ముడు వారి అనుచరులు ఐదేళ్లుగా హిందువులపై దాడులు చేస్తూ విచక్షణా రహితంగా వ్యవహరిస్తున్నారు. అయినా జగన్‌ ఆయనకే టికెట్‌ కేటాయించారు. బాషా ఒకవేళ తప్పులు చేసి ఉంటే తన మొహం చూసి పెద్ద మనసుతో ఆయనకు గెలిపించాలని జగన్‌ కోరారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

జగన్ బాబాయ్ వివేకా హత్య కేసు అవినాష్ రెడ్డిని వెంటాడుతోంది. కుటుంబంలోని ఇద్దరు చెల్లెళ్లు షర్మిల, సునీత కలిసి అన్నపై గెలవాలని ఈ అవకాశాన్ని అనుకూలంగా మలుచుకున్నారు. విజయమ్మతో షర్మిలకు ఓట్లు వేయాలని ప్రజలకు చెప్పించుకోగలిగారు. ‘సీఎం జగన్‌ మా పులివెందులకు చెందిన వాడు’ అని ప్రజలు చెప్పుకోవడం తప్ప ఐదేళ్లలో చేసిందేమీ లేదని, అవినాష్ కు పులివెందుల బాధ్యత అప్పగిస్తే, హత్య కేసులో కూరుకుపోయిన ఆయన కూడా పెద్దగా పట్టించుకోలేదు అని వారు ప్రచారం చేశారు.

కమలాపురం సిట్టింగ్ ఎమ్మెల్యే రవీంద్ర రెడ్డికే ఈ సారి టికెట్‌ కేటాయించారు. జగన్‌కు ఆయన మేనమామ. ఈ ఒక్క కారణంతోనే గెలుస్తున్నారే తప్ప నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి ఏమీ లేదు. తన సొంత కానిస్టెన్సీ ప్రజలతో కూడా ఆయనకు సంబంధాలు లేవంటే సందేహం లేదు. కడప మాకు కంచుకోట అనే భ్రమలో ఉన్నందున జగన్‌ మొదలు అవినాష్ రెడ్డి వరకు ప్రజల గోడు పట్టించుకోవడం లేదని ఆరోపణలు ఉన్నాయి.

విజయమ్మ కూడా అవినాష్ ను కాదని షర్మిలను భుజాన ఎక్కించుకుంది. కనుక ‘ఒక్క షర్మిలనే ఎందుకు..? ఈసారి కూటమి అభ్యర్థులందరినీ గెలిపించి తమను చులకనగా చూస్తున్న వైసీపీ నేతలకు గడ్డి పెడదాం’ అని కడపలో ప్రజలు అనుకుంటున్నారు. కనుక ఈసారి వైసీపీ ఓటమి ‘కడప గడప’ నుంచే మొదలవుతుంది. ఈ ఓటమి బాధ్యత జగన్‌ మొదలుకొని జిల్లా నేతలందరికీ, విజయమ్మకి, షర్మిల, సునీతకు సమానంగా దక్కాల్సిందే.

TAGS