Districts Reorganization : జిల్లాల పునర్వ్యవస్థీకరణకు కాంగ్రెస్ కసరత్తు చేస్తోందా?
Districts Reorganization : బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కొత్త జిల్లాల ఏర్పాటు చేసింది. 10 జిల్లాలను ఏకంగా 33 జిల్లాలుగా మార్చింది. దీంతో అప్పట్లోనే విమర్శలు వచ్చాయి. అధికారం చేతిలో ఉంది కదా అని ఇష్టానుసారంగా జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేసింది. శాస్త్రీయత పాటించకుండా ఇబ్బడిముబ్బడిగా జిల్లాలను ఏర్పాటు చేసింది. రాజకీయ అవసరాల కోసమే జిల్లాల ఏర్పాటుకు ఆమోదముద్ర వేసింది.
ప్రస్తుతం జిల్లాల ఏర్పాటు సరిగా లేదని సుప్రీంకోర్టు మాజీ జడ్జితో విచారణ జరిపించి శాస్త్రీయంగా జిల్లాల ఏర్పాటు చేయించాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. దీనికి గాను కార్యాచరణ రూపొందిస్తోంది. విధి విధానాలు ఖరారు చేస్తోంది. కేసీఆర్ ప్రభుత్వం చేసిన పని సరిగా లేదని జిల్లాల స్వరూపం మార్చేందుకు సన్నద్ధమవుతోంది.
గతంలో 37 రెవెన్యూ డివిజన్లుండగా వాటిని 74 గా చేసింది. 464 మండలాలకు 607కు పెంచింది. మండలాల ఏర్పాటులో శాస్త్రీయత పాటించలేదనే విమర్శలు వస్తున్నాయి. కేవలం నాలుగైదు గ్రామాలతో మండలాలు ఏర్పాటు చేయడంతో విమర్శలు వెల్లువెత్తాయి. ఒకటిన్నర, రెండు నియోజకవర్గాలకో జిల్లాగా విభజించడం సందేహాలకు తావిచ్చింది.
హైదరాబాద్ ను 24 నియోజకవర్గాలుగా చేసింది. ఉప్పల్, మల్కాజిగిరి, కూకట్ పల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాలను మేడ్చల్ లో కలిపేశారు. పటాన్ చెరు సెగ్మెంట్ ను రంగారెడ్డి జిల్లాలో కొనసాగిస్తున్నారు. ఎల్బీనగర్, రాజేంద్రనగర్ సెగ్మెంట్లు కూడా రంగారెడ్డిలోనే ఉన్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలోనే నాలుగు జిల్లాలుగా చేసే అవకాశమున్నా బీఆర్ఎస్ తనకు అనుకూలంగా జిల్లాల సంఖ్యను పెంచేసింది. ఇప్పుడు కాంగ్రెస్ వాటిని తగ్గించేందుకు సంకల్పించింది.
కేసీఆర్ తన లక్కీ నెంబర్ వచ్చేలా 33 జిల్లాలుగా మార్చారు. అవసరం లేని చోట కూడా జిల్లా కేంద్రాలను ఏర్పాటు చేసి తన పంతం నెగ్గించుకున్నారు. శాస్త్రీయతన పరిగణనలోకి తీసుకోకుండా తన మదిలో ఏ ఆలోచన ఉందో దానికి అనుగుణంగానే మలుచుకోవడం విమర్శలకు తావిచ్చింది. ఇప్పుడు 33 జిల్లాలను ఎన్ని జిల్లాలుగా మార్చుతారో అనే చర్చ వస్తోంది.