JAISW News Telugu

Class director : తన ట్యాగ్ ను మార్చుకోబోతున్న క్లాస్ డైరెక్టర్ ?

Class director

Class director

Class director : తెలుగులో బాపు-రమణ, కే విశ్వనాథ్, వంశీ తర్వాత మళ్లీ అంతలా పూర్తి ఫ్యామిలీ ఓరియెంటెడ్, క్లాస్ సినిమాలను తెరకెక్కిస్తాడనే పేరు తెచ్చుకున్నాడు శేఖర్ కమ్ముల. భారీ హంగులకు వెళ్లకుండా పరిమిత బడ్జెట్, స్టార్స్ తో ప్రయోగాల జోలికి వెళ్లకుండా ఉన్నంతలో ప్రతీ ఫ్రేమ్ ను అందంగా, ఆహ్లాదంగా, మససుకు హత్తుకునేలా తెరకెక్కించడంలో దిట్ట శేఖర్ కమ్ముల. అటు గోదావరి, ఇటు తెలంగాణ యాసలను సైతం తెరపై చాలా చక్కగా ఆవిష్కరించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇందుకు ఆనంద్‌, గోదావ‌రి, హ్యాపీడేస్, ఫిదా సినిమాలే నిదర్శనం.

గోదావ‌రి గ‌ట్టున కూర్చొని ఆ చ‌ల్లగాలి మాటున వేడి వేడి కాఫీ తాగిన ఫీలింగ్స్  శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలు చూస్తే కలుగుతాయి. ఓవ‌ర్సీస్ ఆడియ‌న్స్ ప‌ల్స్ బాగా ప‌ట్టేశాడు శేఖ‌ర్ క‌మ్ముల. అతని నుంచి ఓ సినిమా రిలీజ్ అవుతున్నదంటే అది క‌చ్చితంగా క్లాస్ సినిమానే అని ప్రేక్షకులు భావిస్తారు. కానీ ‘కుబేర‌’ సినిమా పోస్టర్లు, టీజర్ తో షాక్ ఇచ్చాడు శేఖర్ కమ్ముల. ధ‌నుష్‌, నాగార్జున‌ల‌తో శేఖ‌ర్ క‌మ్ముల చేస్తున్న తాజా చిత్రం ‘కుబేర‌’. ఈ సినిమా సెట్స్ పై ఉంది. షూటింగ్ కూడా శ‌ర వేగంగా సాగుతున్నది. శేఖర్ కమ్ముల తొలిసారి  మాస్, యాక్షన్ బాట పట్టినట్లు పోస్టర్లు చూస్తు అర్థమవుతున్నది.  ఇప్పటిదాకా తన సినిమాల్లో స్టార్లు కనిపించలేదు. స్టార్ల కోసం ఎప్పుడూ వెంపర్లాడలేదు శేఖర్ కమ్ముల.

శేఖర్ కమ్ముల స్టార్ డమ్ ను నమ్ముకొని సినిమాలు తీయలేదు.  ప్లాఫుల్లో ఉన్న సుమంత్ కు గోదావరి సినిమాతో హిట్టిచ్చాడు శేఖర్ కమ్ముల. అలాగే వరుణ్ తేజ్ కూడా వరుస ప్లాఫుల్లో ఉండగా ఫిదా సినిమాతో సక్సెస్ ఇచ్చాడు. నాగ చైతన్య ను కూడా ప్లాఫుల్లో విలవిలలాడుతుండగా లవ్ స్టోరీ సినిమాతో అక్కినేని వారసుడికి సైతం ఓ హిట్టిచ్చాడు.  మిగతా సినిమాలన్నీ కొత్త వాళ్లతో చేసినవే.  అనామకుడిగా ఉన్న సమయంలో విజయ్ దేవరకొండ కూడా శేఖర్ కమ్ముల సినిమాలో నటించాడు.

సైలెంట్ గా సినిమాలు చేస్తూ వెళ్తున్న శేఖర్ కమ్ముల ఒక్కసారిగా మల్టీస్టారర్ సినిమాతో షాకిచ్చాడు. శేఖర్ కమ్ముల స్టార్లను పెట్టుకొని సినిమా చేయడం ఏంటని అంతా షాక్ అవుతున్నారు. అదీ రెండు భాషల్లోని అగ్ర హీరోలను మెప్పించాడంటే మామూలు విషయం కాదంటున్నారు సినీ విశ్లేషకులు. శేఖర్ కమ్ముల కూడా ఇతర డైరెక్టర్ల లాగే డైవర్ట్ అవుతున్నాడా అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా ర‌షెష్ చూసిన‌వాళ్లంతా శేఖ‌ర్ క‌మ్ములలోనూ మార్పు మొదలైందని, త‌న‌ని తాను చాలా అప్ డేట్ చేసుకున్నాడ‌ని, త‌న‌దైన శైలిలో  క‌మ‌ర్షియ‌ల్ హంగులను టచ్ చేశాడని చెబుతున్నారు.

ఇక శేఖర్ కమ్ముల సినిమాల్లో బీజీఎంతో పాటు పాటలు కూడా మెలోడి ఎక్కువగా ఉంటుంది.  మాస్ బీట్స్ కు అవకాశం ఇవ్వడు.  అలాంటిది రాక్ స్టార్  దేవిశ్రీ ప్రసాద్ ను మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంచుకొని మరో షాక్ ఇచ్చాడు.  ఈసారి శేఖర్ కమ్ముల తన ఫార్ములాను ఫాలో అవుతూనే ఓ మాస్ ట్రీట్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడని టాక్.  ఇందుకు ‘కుబేర‌’ ను ఎంచుకున్నాడని చర్చించుకుంటున్నారు. మ‌రి.. కుబేర‌తో శేఖ‌ర్ క‌మ్ముల తనపై ఉన్న మార్క్ ను చెరిపేసుకుంటాడా లేక కొత్త ట్యాగ్ వేయించుకుంటాడో కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.

Exit mobile version