YCP incharges : వైసీపీలో ఇన్ చార్జీల మార్పు చేస్తున్నారు. ఇప్పటివరకు ప్రకటించిన నాలుగు జాబితాల్లో అరవై మంది ఎమ్మెల్యేలను మార్చేశారు. దీంతో కొత్తవారికి అవకాశం ఇస్తున్నారు. వైసీపీ ఇన్ చార్జీల మార్పుతో సీట్లు కోల్పోతున్న చాలా మంది ఆరోపణలు చేస్తున్నారు. సిట్టింగ్ స్థానాలు కోల్పోతున్న ఎమ్మెల్యేలు అందుకు కారణాలు కూడా చెబుతున్నారు.
విపక్ష నేతలైన చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కల్యాణ్ లను తిట్టకపోవడమే ప్రధాన కారణంగా సూచిస్తున్నారు. పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారధి, తిరువూరు రక్షణనిధి వరకు ఇదే మాట అంటున్నారు. చంద్రబాబు, లోకేష్, పవన్ లపై కొడాలి నాని, జోగి రమేష్ తరహాలో తిట్టిన వారికే పదవులు ఖాయంగా కనిపించింది. దీంతో ఇన్ చార్జీల మార్పుల్లో వీరికి సీట్లు రావనే విషయం స్పష్టమవుతోంది.
ప్రతిపక్ష నేతల్ని దూకుడుగా తిడితే తమ స్థానాలకు కూడా డోకా ఉండదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యర్థులను తిట్టకుండా పోవడంతోనే ఇలా తమ స్థానాలు గల్లంతయ్యాయని విచారం వ్యక్తం చేస్తున్నారు. వీరి వాయిస్ ప్రజల్లోకి వెళ్లకపోవడంతోనే వారి ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. విపక్ష నేతల్ని టార్గెట్ చేసుకుని ఎడాపెడా తిడితే బాగుండేదని అనుకుంటున్నారు.
ఇప్పుడు తమ సీటుకు ఎసరొచ్చింది. వైసీపీ కాదనడంతో ఇతర మార్గాలు కనిపించడం లేదు. ఎన్నో ఏళ్లుగా పార్టీనే నమ్ముకున్నా ఫలితం మాత్రం శూన్యం. రాబోయే ఎన్నికల్లో సీటు రాకపోవడం వల్ల తమ ఉనికికే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. జరగాల్సిన నష్టం జరిగిపోవడంతో ఇక చేసేదేముందని విచారం వ్యక్తం చేస్తున్నారు.