Mandapeta : మండపేట అభ్యర్థిని ప్రకటించింది అందుకేనా?

Mandapet candidate announced

Mandapet candidate announced

Mandapeta : ఏపీలో ఎన్నికల రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. అన్ని ప్రధాన పార్టీలు తమ తమ వ్యూహాలతో ప్రత్యర్థులకు దీటుగా ముందుకెళ్తున్నాయి. అధికార వైసీపీ ఇప్పటికే నాలుగు జాబితాలను విడుదల చేసింది. తమ అభ్యర్థులను పూర్తిగా ప్రకటించేందుకు ఆ పార్టీ సిద్ధమవుతోంది. అనంతరం పూర్తిస్థాయిలో ప్రచారంలోకి దిగాలని భావిస్తోంది.

ఇక టీడీపీ-జనసేన తమ అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. అధినేతలు ఇద్దరూ అదే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికల షెడ్యూల్ విడుదల తర్వాతే తమ అభ్యర్థులను ప్రకటించాలని అధినేతలు భావిస్తున్నారు. దీనికి సన్నాహకంగా ‘‘రా..కదిలిరా ’ సభా వేదికపై నుంచి అభ్యర్థుల పేర్లను టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటిస్తూ వస్తున్నారు.

తాజాగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మండపేట అభ్యర్థిగా వేగుళ్ల జోగేశ్వరరావు పేరును చంద్రబాబు ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా ఆయనను గెలిపించాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఆయనే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే. సిట్టింగ్ కే టికెట్ ఇవ్వనున్నట్లు చంద్రబాబు వెల్లడించారు.

అయితే జనసేనతో పొత్తు ఉన్నప్పటికీ మండపేట నుంచి పోటీ చేయడానికి సర్వసన్నాహాలు చేసుకుంటున్నప్పటికీ.. చంద్రబాబు ఇలా ఏకపక్షంగా అభ్యర్థులను ఖరారు చేయడం వివాదానికి దారితీసింది. ఈ విషయం మిత్రపక్షం జనసేనలో చిచ్చురేపినట్టయింది. జనసేన నుంచి సీనియర్ నేత లీలాకృష్ణ.. మండపేట నుంచి పోటీ చేయడానికి ముందు నుంచే సన్నాహాలు చేసుకుంటున్నారు. 2019 ఎన్నికల్లోనూ ఆయన జనసేన అభ్యర్థిగా బరిలో దిగారు. 35వేలకు పైగా ఓట్లు సాధించి మూడో స్థానంలో నిలిచారు. ఇప్పుడు టీడీపీతో పొత్తు ఉన్న క్రమంలో మండపేట సీటు జనసేనకే వస్తుందనే ఆశతో లీలాకృష్ణ ఉన్నారు.

అనూహ్యంగా జనసేన అగ్రనాయకత్వానికి మాటమాత్రంగానైనా చెప్పకుండా మండపేట నియోజకవర్గానికి అభ్యర్థిగా వేగుళ్ల జోగేశ్వరరావును ప్రకటించడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. చంద్రబాబు ప్రకటన తర్వాత మండపేట రాజకీయాలు శరవేగంగా మారిపోయాయి. లీలాకృష్ణ పార్టీ నాయకులు, తన అనుచరులతో సమావేశం అయ్యారు. చంద్రబాబుపై పలు విమర్శలు చేశారు.

అయితే ఇది టీడీపీ సిట్టింగ్ స్థానం కావడంతోనే చంద్రబాబు ఏకపక్షంగా ప్రకటించినట్టు తెలుస్తోంది. టీడీపీకి పూర్తి పట్టు ఉన్న నియోజకవర్గం కావడం.. గతంలో ముక్కోణ పోటీలో తమ అభ్యర్థి గెలిచి సత్తా చాటడం.. ఈసారి కూడా టీడీపీ అభ్యర్థికే గెలుపు అవకాశాలు ఉన్నాయని చంద్రబాబు భావించినట్టు తెలుస్తోంది. తమ సీటే కావడం వల్లే వేగుళ్ల జోగేశ్వరరావు పేరును ముందుగానే ప్రకటించినట్లు తెలుస్తోంది.

పొత్తులో భాగంగా చంద్రబాబు, పవన్ కల్యాణ్ మధ్య చర్చలు జరుగుతుండడంతో పాటు జనసేనకు కేటాయించే సీట్లపై కూడా అంతర్గతంగా ఏదో ఒక ఫిగర్ డిసైడ్ అయ్యే ఉంటుందని అందరూ భావిస్తున్నారు. దాదాపు టీడీపీ సిట్టింగుల సీట్లను టీడీపీకే వదిలే చాన్స్ ఉండొచ్చని తెలుస్తోంది. మిగతా సీట్లను జనసేనకు ఇచ్చే అవకాశాలు ఉండొచ్చని అంటున్నారు. పొత్తు ధర్మం ప్రకారమే ఎన్నికలకు వెళ్లాలని ఇద్దరూ అధినేతలు భావిస్తున్నారు. దీంట్లో ఎవరికీ ఇబ్బంది కలుగకుండా సర్దుబాటు చేసుకునే అవకాశం ఉంది. ఎవరికీ సీటు వచ్చినా రెండు పార్టీల నాయకులు, క్యాడర్ పరస్పరం సహకరించుకోవాలని నేతలు ఇదివరకే సూచించారు. ఇక మండపేటలో కూడా అదే జరిగి ఉంటుందని భావిస్తున్నారు.

TAGS