KCR : కర్ణుడి చావుకు శతకోటి కారణాలు చందంగా ఏపీలో వైసీపీ, తెలంగాణలో బీఆర్ఎస్ పతనానికి కూడా ఒకటి కాదు వందల కారణాలు చెప్పుకోవచ్చు. జగన్, కేసీఆర్ వాటిని అంగీకరించకపోయినా అవి వాస్తవాలని అందరికీ తెలిసిందే. కేసీఆర్ విషయానికి వస్తే ఓటుకు నోటు కేసు కూడా అందులో ఒకటని చెప్పచ్చు.
కేసీఆర్ అధికారంలో ఉండగా ఒకేసారి ఇటు రేవంత్, అటు చంద్రబాబు నాయుడిని ఒకే సారి అప్రదిష్టపాలు చేసి రాజకీయంగా దెబ్బ తీయాలని ప్లాన్ వేశారు. వాస్తవం చెప్పాలంటే కొంత వరకు ఆయన ప్రయత్నం ఫలించింది. ఆ కేసుతో కేసీఆర్ ఎంత పాపులర్ అయ్యారో, వారు ఇద్దరు కూడా అంతగా అప్రదిష్టపాలయ్యారు.
ఆ కేసుతో కేసీఆర్ వారి పరువు తీయగలిగారు కానీ ఏమీ చేయలేకపోయారు. ఆ కేసు కారణంగానే చంద్రబాబు, రేవంత్ అనే ఇద్దరు బలమైన శత్రువులను సృష్టించుకున్నారు. ఆనాడు రేవంత్ రెడ్డిని జైలుకు పంపించి, కూతురు పెళ్లి చేస్తున్నప్పుడు కేసీఆర్ ఇబ్బంది పెట్టారు. అప్పుడే రేవంత్ రెడ్డి శపథం చేశారు. ఏనాటికైనా కేసీఆర్‌ను ఓడించి అదే జైలులో చిప్పకూడు తినిపిస్తానని. చెప్పిన్నట్లుగానే ఎన్నికల్లో అయితే ఓడించారు. శపథం నెరవేర్చుకునేందుకు రేవంత్ అనేక కేసులు సిద్ధం చేసుకున్నారు. వాటిలో ఏదో ఒక కేసులో అతన్ని జైలుకు పంపించకుండా ఉండరని.. నిజం చెప్పాలంటే ఈ విషయం కూడా కేసీఆర్ ఇప్పటికే గ్రహించి ఉంటారు.
ఇక ఆ కేసులో చంద్రబాబును జైల్లో పెట్టేందుకు కేసీఆర్ గట్టి ప్రయత్నమే చేశారు కానీ అవి ఫలించలేదు. ఓటుకి నోటు కేసుతో వారిని భలే దెబ్బ తీశాడని కేసీఆర్ పొంగిపోయారు. కానీ అప్పటి నుంచే అందరి ఫోన్లను కేసీఆర్ ట్యాపింగ్ చేయిస్తున్నారనే విషయం బయట పడడంతో వెనక్కు తగ్గక తప్పలేదు. ఆ ఫోన్ ట్యాపింగ్ కేసులే ఇప్పుడు కేసీఆర్ మెడకు చుట్టుకోబోతున్నాయి.
నాడు తమ పరువు తీసి, రాజకీయంగా దెబ్బతీశాడని కేసీఆర్ మిడిసిపడుతున్నా చంద్రబాబు మాత్రం తొందరపడి నోరు జారలేదు. కేసీఆర్ జోలికి పోలేదు. కానీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఆ అవకాశం రాబోతోందని గుర్తించారు.. కానీ తొందరపడలేదు.
ఈలోగా కేసీఆర్ 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడుని రాజకీయంగా దెబ్బతీశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఇద్దరికీ ఆ అవకాశం వచ్చింది. ఆ ఎన్నికలకు టీడీపీ దూరంగా ఉండి రేవంత్ రెడ్డికి పరోక్షంగా సాయపడింది.
రేవంత్ కూడా సర్వశక్తులు ఒడ్డి పోరాడి కేసీఆర్‌ను ఓడించి మూల కూర్చోబెట్టారు. ఆనాడు కేసీఆర్ వారిని ట్రాప్ చేసి రాజకీయంగా దెబ్బ తీయాలని ప్రయత్నించకపోయి ఉంటే బహుశః కేసీఆర్‌ను ఓడించాలని వారు పట్టుబట్టి ఉండేవారు కాదు. కాని కేసీఆర్ తాను గొప్ప రాజకీయ మేధావినని, అపర చాణక్యుడినని నిరూపించుకునేందుకు చేసిన ఆ ప్రయత్నమే ఇప్పుడు ఆయన పతనానికి ఓ కారణం అయ్యింది.