Australia : ఆస్ట్రేలియాలో టూర్ లో టీమిండియా గేమ్ ప్లాన్ మార్చబోతున్నదా?
తొలి టెస్టుకు దూరంగా రోహిత్ శర్మ
ఆస్ట్రేలియాతో జరిగే తొలి టెస్టులో కెప్టెన్ రోహిత్ శర్మ ఆడడం లేదు. ఈ నిర్ణయం దాదాపు ఖరారైంది. శర్మ భార్యకు డెలివరీ డేట్ దగ్గర పడడంతో తొలి టెస్టుకు దూరంగా ఉంటున్నాడు. ఈ మ్యాచ్‌లో శర్మ స్థానంలో జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. సోమవారం ఉదయం, కోచ్ గౌతమ్ గంభీర్ ఆస్ట్రేలియాకు బయలుదేరే ముందు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా, తొలి టెస్టులో రోహిత్ అందుబాటులో లేకుంటే, కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తాడని చెప్పుకొచ్చాడు.
ఇక ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి ఆస్ట్రేలియాతో జరిగే తొలి టెస్టులో అరంగేట్రం చేయబోతున్నాడని విశ్వసనీయ సమాచారం. ఆస్ట్రేలియా ఏ తో జరిగిన ఇండియా ఏ జట్టులో నితీష్ సభ్యుడు. ధాటిగా బ్యాటింగ్ చేయడంతో పాటు ఫాస్ట్ బౌలింగ్ కూడా చేయగలడు. దీంతో నితీష్ తుది జట్టులో చోటు దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తొలి టెస్టులో టీమ్ ఇండియా నుంచి యశస్వి జైస్వాల్, కెఎల్ రాహుల్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించనున్నారు. శుభ్‌మన్ గిల్ మూడో స్థానంలోనూ, విరాట్ కోహ్లీ నాలుగో స్థానంలోనూ ఆడనున్నారు. వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఐదో స్థానంలో ఆడనున్నాడు. ఇక ఆరు, ఏడు, ఎనిమిది స్థానాల్లో ముగ్గురు ఆల్ రౌండర్లు ఆడనున్నారు. ఇందులో నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజాలు ఆడే అవకాశాలు ఉన్నాయి. ఎలాగైనా సిరీస్ కైవసం చేసుకోవాలనే ఆలోచనతో టీమిండియా క్రికెటర్లు రహస్యంగా తమ ప్రాక్టీస్ సాగిస్తున్నారు. టీమిండియా క్రికెటర్లు ఫోన్లు తీసుకెళ్లడానికి కూడా అనుమతి ఇవ్వడం లేదని, ప్రాక్టీస్ చేస్తున్న గ్రౌండ్ వద్ద అభిమానులను, ఇతరులను కూడా అనుమతించడం లేదని తెలుస్తున్నది.