TDP – YCP : ఆ జిల్లా మంత్రిపదవుల కేటాయింపు విషయంలో వైసీపీని ఫాలో అవుతున్న టీడీపీ ?

TDP - YCP

TDP – YCP

TDP – YCP : ఏపీలో ఎన్నికల కోలాహలం పూర్తయింది. కొత్త ప్రభుత్వం కొలువు దీరింది. మొత్తం 24మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. అయితే మంత్రి పదవుల కేటాయింపుల్లో పలు జిల్లాలకు గల ప్రాధాన్యతపై చర్చలు తెరపైకి వస్తున్నాయి. టీడీపీ కేబినెట్లో ఆ జిల్లాకు మంత్రిపదవుల కేటాయింపులో వైసీపీని ఫాలో అవుతున్నట్లు అనిపిస్తుంది. ఎందుకంటే సదరు జిల్లాలో ఒకప్పుడు కాంగ్రెస్.. ఆ తర్వాత వైసిపికి కంచుకోటలుగా ఉండేవి. అలాంటి జిల్లాలో టీడీపీ తొలిసారి క్లీన్ స్వీప్ చేసింది. అయితే ఆ జిల్లాకు రెండు మంత్రి పదవులు దక్కాయి. కానీ ఇక్కడే ఆసక్తికర విషయం ఉంది. పార్టీల మధ్య అధికారం మారినా ఆ జిల్లాకు కేటాయించాల్సిన మంత్రుల లెక్క మారలేదట. అదేంటో చూద్దాం. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఆ ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో వైసీపీ క్లిన్ స్వీప్ చేసింది. ఆ సందర్భంలో మంత్రివర్గంలో జిల్లాకు రెండు మంత్రి పదవులు దక్కాయి. ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా జిల్లాకు రెండు మంత్రి పదవులు దక్కాయి. ఇందులో స్పెషాలిటీ ఏం లేదు. కానీ ఆ దక్కిన రెండు మంత్రి పదవులు కూడా అవే స్థానాలు కావడం విశేషం. గతంలో నెల్లూరు సిటి నుంచి అనిల్ కుమార్ యాదవ్, ఆత్మకూరు నుంచి దివంగత మేకపాటి గౌతమ్ రెడ్డికి మంత్రి పదవులు దక్కాయి. ఇప్పుడు కూడా అవే నియోజకవర్గాల నుంచి గెలిచిన నెల్లూరు సిటి నుంచి పొంగూరు నారాయణ, ఆత్మకూరు నుంచి గెలిచిన ఆనం రామనారాయణ రెడ్డిలకు ఫస్ట్ లిస్టులో మంత్రి పదవులు దక్కాయి.

అయితే ఇది యాదృచ్చికంగా జరిగిందా లేదా.. సమీకరణాల్లో వచ్చాయా అన్నది పక్కన పెడితే వరుసగా రెండు పర్యాయాలు ఆ రెండు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు మంత్రులు కావడం విశేషం. కానీ కేబినెట్‎లో మంత్రి పదవుల కోసం ఆశించిన కొందరు ఎమ్మెల్యేలు మా సంగతి ఏంటి అని ప్రశ్నిస్తున్నారు అందులో మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ ఆ లిస్టులో ఉన్నారు. కోటంరెడ్డి నెల్లూరు రూరల్ నుంచి మూడు సార్లు గెలిచారు. 18 నెలల ముందే అధికారాన్ని వదులుకుని వైసీపీకి రెబల్‎గా మారి తెలుగుదేశం పార్టీలో చేరారు. నారా లోకేష్ యువగళం పాదయాత్ర రాష్ట్రంలోనే సూపర్ సక్సెస్ చేసి చూపించారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, తమ్ముడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి యాత్ర సక్సెస్ కోసం కృషి చేశారు. నారా లోకేష్ కూడా ఆ సందర్భంగా నెల్లూరు రూరల్‎లో కోటంరెడ్డి బ్రదర్స్ పడిన కష్టం గురించి ప్రత్యేకంగా చెప్పారు. దీంతో కోటంరెడ్డికి కచ్చితంగా మంత్రి పదవి వస్తుందని ఆయన వర్గం ఆశించింది. ఇక సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చాలా కాలంగా టీడీపీలో కొనసాగుతున్నారు. వరుసగా ఓటమి చెందినప్పటికీ సోమిరెడ్డి ఈ సారి భారీ మెజారిటీతో గెలిచారు. ఈ సారి మంత్రివర్గంలో తన పేరు కచ్చితంగా ఉంటుందని అనుకున్నారు. కానీ నిరాశ మిగిలింది. మరో రెండున్నర ఏళ్ల తర్వాత మార్పులు జరిగితే అవకాశం వస్తుందేమో చూడాలి.

TAGS