Kapu Voters : ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో జనసేనాని పవన్ కళ్యాణ్ ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనే దానిపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. హఠాత్తుగా ఆయన పిఠాపురం నియోజకవర్గానికే మొగ్గు చూపుతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గతంలో పిఠాపురం గురించి చర్చ జరిగినా మెల్లగా అది సద్దుమణిగింది.
తొలుత తాను భీమవరాన్ని ఎంచుకుంటానని చెప్పిన పవన్ కళ్యాణ్. మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులును భీమవరం నుంచి పోటీ చేయమని కోరడంతో ఆయన ఆ ఆలోచనను విరమించుకున్నట్లు స్పష్టమవుతోంది.
ఇది ఇలా ఉండగా జనసేన అధినేత తన విజయావకాశాలను అంచనా వేయడానికి నియోజకవర్గంలో రెండు సర్వేలు నిర్వహించడం వల్లే పిఠాపురం నియోజకవర్గం తెరపైకి వచ్చిందని జనసైనికులు చెబుతున్నారు. పిఠాపురం వైపు మొగ్గు చూపడానికి ప్రధాన కారణం నియోజకవర్గంలో కాపు జనాభా ఎక్కువగా ఉండడమే.
పిఠాపురం నియోజకవర్గంలో మొత్తం 2.5 లక్షల మంది ఓటర్లలో 60 వేల మంది కాపు జనాభా ఉంది. కాపులు, ఇతర కులాల ప్రజలంతా పవన్ కళ్యాణ్ కు ఓటు వేస్తే ఆయన కచ్చితంగా గెలుస్తారని సర్వేలో వెల్లడైంది. ఉభయ గోదావరి జిల్లాల్లో కాపులు, బీసీల మధ్య ఎప్పటి నుంచో విభేదాలు ఉన్నాయి.
అదేవిధంగా కాపులు, ఎస్సీలు కూడా ఒకరితో ఒకరు సఖ్యతగా లేరు. సమాజం మొత్తం కులాల వారీగా చీలిపోయింది. ఇప్పుడు ఓటర్లు కుల హద్దులు దాటి జనసేనకు ఓటేస్తారా? అనే అనుమానం జనసేన పార్టీలో చర్చకు తావిస్తోంది.
కులాల వారీగా అందరినీ కలుపుకొని పోతేనే మంచి మెజారిటీతో గెలువచ్చు. కానీ ఒకరంటే మరొకరికి పడకుంటే మాత్రం మెజారిటీ రాకపోవచ్చన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఏది ఏమైనా ఒకే కులం ఓటర్లను నమ్ముకుంటే మాత్రం అంత ప్రయోజనం లేకపోవచ్చని తెలుస్తోంది.