Jagan
Jagan : ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ టీడీపీ కూటమిని లక్ష్యంగా చేసుకున్నాడా? దూకుడుగా వ్యవహరించేందుకు సిద్ధమవుతున్నాడా అంటే అవుననే టాక్ ఏపీ పొలిటికల్ సర్కిళ్లలో వినిపిస్తు్న్నది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా నిలబెట్టుకునే సంఖ్యా బలం లేకపోవడంతో జగన్ ప్రజల మధ్యలోకి వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని సిద్ధమైనట్లు తెలుస్తున్నది. మరి జగన్ వ్యూహాలు మేరకు ఫలిస్తాయో చూడాల్సిందే.
మొన్నటి అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో వైసీపీ చతికిల పడిపోగా, టీడీపీ మళ్లీ బౌన్స్ బ్యాక్ అయ్యింది. అదే సమయంలో కేంద్రంలో బీజేపీకి టీడీపీ మద్దతు అనివార్యం కావడంతో సీఎం చంద్రబాబుకు మరింత కలిసి వస్తున్నది. దీంతో అధికార పార్టీ చేపట్టే ప్రతి కార్యక్రమంలో సీఎం చంద్రబాబు వైసీపీ అధినేత జగన్ ను లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పిస్తున్నారు. తాము ఐదేళ్లలో చేసిన అభివృద్ధిని జగన్ నాశనం చేశాడంటూ మండిపడుతున్నారు. రాష్ర్టాన్ని అప్పుల కుప్పగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇక మొన్నటి వరకు స్తబ్దుగా ఉన్న వైసీపీ అధినేత జగన్ కూడా కూటమి ప్రభుత్వంపై పోరు సల్పాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తున్నది. ఈ క్రమంలో జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలుస్తున్నది. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోవడంపై కూటమి నేతలు జగన్ ను టార్గెట్ చేస్తున్న విషయం తెలిసిందే. తమ పార్టీ మాత్రమే అసెంబ్లీలో ప్రతిపక్ష పాత్రలో ఉండడంతో తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని జగన్ డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశంపై ఇప్పటికే కోర్టుకు సైతం వెళ్లారు. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ పైనా జగన్ తీవ్రంగా స్పందించారు. టీడీపీ కూటమి ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలకు బడ్జెట్ లో నిధులు సరిపడా కేటాయించకపోవడాన్ని ప్రశ్నిస్తున్నారు.
దూకుడుగానే వెళ్లాలనుకుంటున్నాడా?..
సీఎం చంద్రబాబు ఏపీ ప్రజలను మోసం చేశాడంటూ జగన్ స్వయంగా సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. పార్టీ అభిమానులు కూడా చంద్రబాబును ప్రశ్నిస్తూ పోస్టులు పెట్టాలని సూచించారు. ఒక వేళ ఈ పోస్టులపై అరెస్టులు మొదలైతే తన నుంచే మొదలు కావాలని సవాల్ చేశారు. అలాగే అసెంబ్లీకి వెళ్లకపోవడంతో అనర్హత వేటు వేస్తారనే అంశంపైనా ఆయన స్పందించారు. అనర్హత వేటు వేస్తే దానికి సిద్ధమనేనని జగన్ సవాల్ చేసిన విషయం తెలిసిందే. అనర్హత వేటు వీళ్ల చేతుల్లో ఏమీ లేదన్నారు జగన్. చంద్రబాబు ప్రస్తుతం చెబుతున్న పెట్టుబడులు అన్నీ కూడా తమ హయాంలో చేసుకున్న ఒప్పందాలేనని జగన్ స్పష్టం చేస్తున్నారు.
జనంలోకి వెళ్తారా?..
కేడర్ ను పట్టించుకోకపోవటం.. జనానికి దూరంగా ఉండడమే ఓటమిక ప్రధాన కారణాలని జగన్ సమీక్షల్లో స్పష్టమైది. కూటమి ప్రభుత్వం జగన్ లక్ష్యంగా ముందుకు సాగుతుండగా, తాను కూడా అదే స్థాయిలో కౌంటర్ చేయాలని వైసీసీ అధినేత నిర్ణయం తీసుకున్నారట. ప్రభుత్వ నిర్ణయాలను క్షుణ్ణంగా గమనిస్తూ స్పందించాలని పార్టీలోని కీలక నేతలకు ఆదేశాలు జారీ చేశారట. త్వరలో జిల్లాల పర్యటనలకు జగన్ సిద్ధమవుతున్నారని సమాచారం. జనవరి నుంచి జిల్లాల్లో పార్టీ సమావేశాలతో పాటుగా.. జనంలోకి వెళ్లేందుకు జగన్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని తెలుస్తున్నది.