YCP-Sakshi : వైసీపీని లేపడం సాక్షి వల్ల కాదా? పేలుతున్న సెటైర్లు
YCP-Sakshi : తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు, పత్రికలకు దగ్గర సంబంధం ఉంది. పత్రికాధిపతులు రాజకీయాలను గత దశాబ్దాలుగా శాసిస్తూనే ఉన్నారు. గతంలో ప్రభుత్వాన్ని పడగొట్టాలన్నా, నిలబెట్టాలన్న పత్రికల వల్ల అయ్యేది. ఎందుకంటే పత్రికలను అప్పట్లో జనాలు బాగా నమ్మేవారు. పత్రికల్లో వచ్చేదే నిజమని భావించేవారు. ఈక్రమంలో తెలుగు రాష్ట్రాల్లో ఒక్కొక్క పత్రిక ఒక్కో రాజకీయ పార్టీకి కొమ్ముకాస్తుందడనంలో సందేహం లేదు.
2009 కి ముందు కొన్ని ప్రధాన పత్రికలు ఒక ప్రధాన పార్టీకి మద్దతుగా ఉన్నాయని అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన కుమారుడి చేత సాక్షి దినపత్రికను ప్రారంభింపజేశారు. ఆ పార్టీ వైఎస్ కు అనుకూలంగా, ప్రత్యర్థి పార్టీ అయిన టీడీపీకి వ్యతిరేకంగా కథనాలను వండివార్చేది. ప్రత్యర్థి పత్రికల్లో వచ్చే కథనాలకు కౌంటర్ కథనాలు రాసేది. ఇక ఆ వైఎస్ మరణం తర్వాత పూర్తిగా ఆ పత్రిక నిండా జగన్ అనుకూల కథనాలు, ప్రత్యర్థి పార్టీలపై వ్యతిరేక కథనాలు మాత్రమే కనపడేవి.
ఇక గత 2019 ఎన్నికల్లో ఒక్క చాన్స్ అంటూ జగన్ కు మద్దతుగా అప్పటి చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక కథనాలు రాసింది. చంద్రబాబు ప్రభుత్వం విషం వెదజల్లి మరి కథనాలు ప్రచురించింది. చంద్రబాబు ఎంత అభివృద్ధి చేసినా ఆ పత్రికకు కనపడకపోయేది. జగన్ కు అధికారం ఇస్తే ఆ పథకం, ఈ పథకం అంటూ ఊదరగొట్టింది. ఇక అప్పటి పరిస్థితుల దృష్ట్యా జగన్ అధికారంలోకి వచ్చేశారు.
జగన్ అధికారంలోకి వచ్చాక కూడా సాక్షి డబ్బా కొట్టుడు ఆపలేదు. ఒక పత్రిక పక్షపాత రహితంగా ఉండాలనే ధోరణికే దూరంగా ఎప్పుడూ అదే సోది పెట్టేది. రాజకీయ పార్టీ కరపత్రికలా ఉండే ఆ పత్రికను వైసీపీ కార్యకర్తలు తప్ప మిగతా వారు చదివితే జుగుప్స కలిగేలా తయారై పోయింది ఆ పత్రిక పరిస్థితి. తాజా ఎన్నికల్లో కూడా ఆ పత్రిక రోజు రోజుకూ పడిపోతున్న వైసీపీని లేపేందుకు తెగ ప్రయత్నాలు చేస్తోంది. ప్రత్యర్థి పార్టీలపై విషపు రాతలు.. వైసీపీపై తియ్యటి రాతలు రాస్తూనే ఉంది. రాష్ట్రంలోని ఎన్నో సమస్యలను పక్కకుపెట్టి వైసీపీ అధికారంలోకి రావడానికి కొత్త కొత్త కథలు తయారు చేస్తోంది.
అయితే ఇప్పటి ఓటర్లు తెలవిగలవారు. గతంలో పత్రికల్లో ఏది రాస్తే అది నమ్మేవారు. ఇప్పుడు పత్రికలను చదివి ఓటేసే రోజులు పోయాయి. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో.. రాష్ట్ర స్థాయిలో ఏ అభివృద్ధి జరిగిందో.. రాజధాని కథ ఏమైందో.. ఉపాధి, ఉద్యోగ, మౌలిక సదుపాయాల కల్పన ఎలా ఉందో తెలుసుకోలేని ఓటర్లు ఎవరూ లేరు. సాక్షి పత్రిక కంటే జనాలకే ఎక్కువ తెలుసు. ప్రజలు ఇప్పటికే డిసైడ్ అయిపోయారు ఏ పార్టీకి ఓటెయ్యాలో..ఇక సాక్షి ఎంత గాలి కొట్టినా వైసీపీ లేచే పరిస్థితి లేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇలాంటి సెటైర్లే బాగా పేలుతున్నాయి. వైసీపీని లేపడానికి సాక్షి చేస్తున్న ప్రయత్నాలు మీమ్స్ రూపంలో నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.