JAISW News Telugu

Third world war : మూడో ప్రపంచ యుద్ధం మొదలైనట్లేనా ?

third world war : పశ్చిమాసియాలో ప్రస్తుతం గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. రష్యా ఉక్రెయిన్, ఇజ్రాయెల్ హమాస్ ల మధ్య భీకరయుద్ధం కొనసాగుతుంది. ఇప్పుడు అమెరికా, రష్యా, ఉక్రెయిన్, ఇజ్రాయెల్‌, ఇరాన్, ఇరాక్‌లో ఏం జరిగితే మాకెందుకు అనుకునే పరిస్థితి అయితే లేదు. ప్రతి దేశానికి సంబంధించిన పరిస్థితులపై ప్రతి ఒక్కరూ ఓ కన్నేసి ఉంచుతున్నారు. ప్రపంచంలో ఏ మూల ఏం జరిగిన దాని ప్రభావం ప్రత్యక్షంగానో.. పరోక్షంగానో భారత్‌తో సహా అన్ని దేశాలపై పడుతూ ఉంటుంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ గెలిస్తే ఒకలాగా…  కమలాహారిస్ గెలిస్తే మరోలాగా  భారత్‌పై ప్రభావం ఉండవచ్చు. ఉక్రెయిన్ దేశంపై రష్యా బాంబుల వర్షం కురిపిస్తే ఉక్రెయిన్లో వైద్య విద్య చదువేందుకు వెళ్లిన భారతీయ విద్యార్దులను విమానాలు పంపి తెచ్చుకోవాల్సిన పరిస్థితి. ఆ యుద్ధం కారణంగా రష్యాపై అగ్రరాజ్యాలు ఆంక్షలు విధించడంతో ముడిచమురు ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. దాంతో రష్యా తీవ్ర ఆర్ధిక ఇబ్బందులలో కూరుకుపోయి తక్కువ ధరకు ముడిచమురు ఆఫర్ చేసే పరిస్థితికి దిగజారింది. దానిని భారత్‌ కొనుగోలు చేయడంపై మొదట విమర్శలు వచ్చినా, దేశ ప్రయోజనాల దృష్ట్యా అదే సరైన నిర్ణయమని తర్వాత అందరూ ఒప్పుకోక తప్పలేదు.

రష్యా-ఉక్రెయిన్ మద్య యుద్ధం మూడేళ్లు కావస్తున్నా ఇంకా ముగియకపోగా రష్యాకు మద్దతుగా ఉత్తర కొరియా సైనికులను పంపిస్తుండటం, ఇటీవల ఖండాంతర క్షిపణి ప్రయోగం చేయడంతో అమెరికా అప్రమత్తమైంది. ఉత్తర కొరియా కనుక ఈ యుద్ధంలో ప్రవేశిస్తే అమెరికా కూడా ప్రవేశించడం ఖాయమని తెలుస్తోంది. చాలా దూకుడుగా వ్యవహరించే డొనాల్డ్ ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడుగా ఎన్నికైతే ఈ యుద్ధం ఇంకా విస్తరించినా ఆశ్చర్యం లేదు. మరోపక్క ఇరాన్, ఇరాక్ కలిసి ఇజ్రాయెల్‌తో యుద్ధాన్ని మొదలు పెట్టాయి.  ఇజ్రాయెల్‌ పక్కనే ఉన్న పాలస్తీనాతో కూడా యుద్ధం చేస్తూనే ఉంది. ఈ యుద్ధంలో అమెరికా ఇజ్రాయెల్‌కి అండగా నిలుస్తోంది. మరోపక్క సిరియాతో అమెరికా వేరేగా మరో యుద్ధం చేస్తోంది.  అమెరికా, ఇజ్రాయెల్‌ ధాటికి చిన్న దేశాలనైన ఇరాన్, ఇరాక్, పాలస్తీనా, సిరియా వంటి దేశాలు తట్టుకోలేవు. కనుక వాటికి అండగా కొన్ని గల్ఫ్ దేశాలు ముందుకు రావచ్చు లేదా చాటుగా వాటికి అవసరమైన సహాయసహకారాలు అందించవచ్చు.

అలాగే భారత్‌కి పక్కలో బల్లెంలా మారిన చైనా సరిహద్దులో తరచూ కవ్విస్తూనే ఉంది. భారత్‌ భూభాగంలోకి చొచ్చుకువచ్చేందుకు ప్రయత్నిస్తోంది. భారత్‌లో అరుణాచల్ ప్రదేశ్ తమదే అని చైనా ఎప్పటి నుంచో వాదిస్తోంది. అలాగే చైనా తన ఆయుధ శక్తి ప్రదరిస్తూ ఫిలిపిన్స్, తైవాన్ దేశాలను లొంగదీసుకునేందుకు ప్రయత్నిస్తుంది. భారత్‌ నుంచి జమ్మూ కశ్మీర్‌ని విడదీసేందుకు పాకిస్తాన్ కొన్నేళ్లుగా వేర్పాటువాదులను ప్రోత్సహిస్తూనే ఉంది. ఉగ్రదాదులు చేయిస్తూనే ఉంది. మొత్తంగా చూస్తే ప్రపంచంలో ప్రధాన దేశాలన్నీ యుద్ధంలోనో లేదా యుద్ధం అంచులలో ఉన్నాయని స్పష్టమవుతుంది. కానీ వీటన్నిటి మద్య భారత్‌ ఒక్కటే శాంతికాముక దేశంగా కనిపిస్తోంది.

Exit mobile version