Raghu Rama Krishna Raju : రఘు రామ కృష్ణం రాజు (ఆర్ఆర్ఆర్) గురించి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పెద్దగా పరిచయం అవసరం లేదు. నరసాపురం లోక్ సభ సెగ్మెంట్ లో అనతి కాలంలోనే తిరుగులేని నేతగా ఎదిగారు. 17వ లోక్ సభకు వైఎస్ఆర్ కాంగ్రెస్ తరుఫున 2019లో నరసాపురం నుంచి పోటీచేసి విజయం సాధించాడు. ఆ ఎన్నికల్లోనే సమీప టీడీడీ అభ్యర్థిపై 31 వేల పైచిలుకు ఓట్లు సాధించి విజయం అందుకున్నారు.
వైసీపీ నుంచి గెలుపొందిన రాజు జగన్ పథకాలపై నిరసనగళం విప్పేవారు. దీంతో రాజును అనర్హుడిగా ప్రకటించాలని 2020లో లోక్ సభ స్పీకర్ కు వైసీపీ లేఖ కూడా రాసింది. దీన్ని తిప్పికొడుతూ రాజు ప్రధాని మోడీకి లేఖ రాశారు. ఇవన్నీ ఒకఎత్తయితే.. ఈ సారి పార్లమెంట్ ఎన్నికల్లో రఘు రామ కృష్ణం రాజుకు సీటు రాకపోవడంతో ఆర్ఆర్ఆర్ గుస్సాగా ఉన్నట్లు తెలుస్తోంది.
రఘు రామ కృష్ణం రాజుకు సీటు ఇచ్చి న్యాయం చేయాలని ఆయన అభిమానులు మద్దతు పలుకుతున్నారు. వైసీపీ ఎంపీగా ఉన్నా కూడా తనకు నచ్చని పథకాలపై మాట్లాడే ధైర్యం ఒక్క రఘురామ రాజుకు మాత్రమే ఉందని తన అభిమానులు చెప్పుకచ్చారు. ఈ విధానంతోనే ఆయనను వైసీపీ నుంచి వెళ్లగొట్టారన్నారు. తర్వాత టీడీపీ గూటికి చేరిన ఆర్ఆర్ఆర్ కూటమి తనకు నర్సాపూర్ సీటు ఇస్తుందని ఆశించాడు కానీ దక్కలేదు.
బీజేపీ అయినా తనకు కేటాయిస్తుందని అనుకున్నాడు. కానీ బీజేపీ ఇటీవల ప్రకటించిన మూడో లిస్ట్ లో కూడా రఘు రామ కృష్ణం రాజు పేరు లేపోవడంతో ఆయన ఇదంతా జగన్ కట్రేనని మండిపడుతున్నారు. జగన్ కుటిల రాజకీయంతోనే నర్సాపురం టికెట్ తనకు దక్కలేదని ఆరోపించారు. నాలుగున్నరేళ్ల నుంచి జగన్ పాలనకు వ్యతిరేకంగా వెళ్తుండడంతోనే తమను బయటకు వెళ్లగొట్టాడని ఆరోపించాడు.
ఆర్ఆర్ఆర్ కు మద్దతుగా పోరాటం చేసేందుకు అభిమానులు సిద్ధం అయ్యారు. జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడిలో ఈ రోజు (మార్చి 26) ప్రత్యేక పూజలు చేసి ప్రత్యేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. నరసాపురం టికెట్ తనకు కేటాయించే వరకు పోరాటం ఆగదని ఆయన అభిమానులు చెప్తున్నారు.