Devineni Uma : ఎన్నికల అనంతరం చెలరేగిన హింసలో గాయపడిన బాధితుల గోడును ప్రసారం చేసిన మీడియాపై కేసులు పెట్టడం దారుణమని టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ అన్నారు. మంగళగిరిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. వైజాగ్ లో ఎన్నికల అనంతరం ఓటేయలేదనే కక్షతో ముగ్గురు మహిళలపై దాడి చేసిన ఘటనపై డీసీపీ ప్రెస్ మీట్ ను మీడియా ప్రసారం చేసిందని తెలిపారు. ఆ తర్వాత కూటమి నేత విష్ణుకుమార్ రాజు ప్రెస్ మీట్ ను లైవ్ లో చూపించినందుకు ఈటీవీ ప్రతినిధిని ఏ1, ఏబిఎన్ ప్రతినిధిని ఏ2, విష్ణుకుమార్ రాజును ఏ3గా చేర్చారని పేర్కొన్నారు. బాధితుల గొంతును వినిపిస్తే కేసులు పెడతారా? పోలీసు వ్యవస్థను పూర్తిగా భ్రష్టు పట్టించారని అన్నారు.
‘‘మీడియాపైన పెట్టిన సెక్షన్లు కూడా ఆశ్చర్యంగా ఉన్నాయి. దీంతో కంచరపాలెం పోలీసుల స్వామి భక్తి మొత్తం దేశానికి తెలిసింది. డీసీపీ సత్తిబాబు అత్యుత్సాహం ప్రదర్శించారు. అడ్డగోలుగా ఎఫ్ఐఆర్ నమోదు చేసిన విషయంపై సెట్, ఎన్నికల సంఘం దృష్టి సారించాలి. ఈ ఘటనపై డీజీపీ వివరణ ఇవ్వాలి. దీని వెనుక సీఎస్, తాడేపల్లి ప్యాలెస్ ఆదేశాలున్నట్లు తెలుస్తోంది.’’ అని దేవినేని అన్నారు.