Actress Hema : బెంగళూరు రేవ్ పార్టీ తెలుగు రాష్ట్రాల్లో ఇంకా ప్రకంపనలు సృష్టిస్తోంది. రేవ్ పార్టీ ఘటనలో పోలీసులు తమ దర్యాప్తును వేగవంతం చేశారు. బ్లడ్ శాంపిల్స్ టెస్టులో పాజిటివ్ గా వచ్చిన 86 మందికి నోటీసులు జారీ చేసి వారిని విచారణకు పిలుస్తున్నారు. వీరిలో తెలుగు సినీ నటి హేమ కూడా ఉన్నారు. తాను పార్టీలో లేనంటూ దబాయిస్తూ వచ్చిన ఈమె డ్రగ్స్ టెస్టులో అడ్డంగా దొరికిపోవడంతో హేమకు కూడా నోటీసులు జారీ చేశారు. ఈ నెల 27న విచారణకు హాజరుకావాల్సిందిగా హేమ సహా ఎనిమిది మందికి సమన్లు వెళ్లాయి. అయితే ఆమె మినహా మిగిలినవారు బెంగళూరు పోలీసుల ఎదుట హాజరయ్యారు.
ఇప్పటికే రేవ్ పార్టీ వ్యవహారంలో తీవ్ర విమర్శలు ఎదుర్కోంటున్న హేమ.. పోలీస్ విచారణకు కూడా వెళ్లకపోవడం అనేక అనుమానాలకు తావిచ్చింది. తనకు జ్వరంగా ఉందని, అనారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని విచారణకు హాజరయ్యేందుకు మరో వారం సమయం కావాలని సీసీబీ అధికారులకు హేమ లేఖ రాశారు. దీనిని పరిగణనలోనికి తీసుకున్న పోలీసులు ఇవాళ హేమకు మరోసారి నోటీసులు జారీ చేశారు. జూన్ 1న విచారణకు హాజరుకావాల్సిందిగా అందులో పేర్కొన్నారు. మరి ఆరోజునైనా హేమ విచారణకు వెళ్తుందా, లేక మరేదైనా సాకు చెబుతారా అంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
పరిణామాలు చూస్తుంటే హేమ ఈ వివాదాన్ని అనవసరంగా తెగే దాకా లాగుతుందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. పార్టీలో దొరికినవారంతా కిక్కురుమనకుండా ఉంటే.. ఈమె మాత్రం నేను పార్టీలోనే లేదు, హైదరాబాద్‌లోనే చిల్ అవుతున్నానని, బిర్యానీ చేస్తున్నానంటూ వీడియోలు వదిలింది. ఏదో కుటుంబ సభ్యులకు తాను పోలీసుల కస్టడీలో ఉన్నానని చెప్పమని ఫోన్ ఇస్తే ఇంతకి తెగిస్తుందా అంటూ ఆమెపై నెటిజన్లు మండిపడుతున్నారు.
ఇంతే కాదు హేమ తన స్క్రీన్ నేమ్‌ను దాచి అసలు పేరు (కృష్ణవేణి)తో పార్టీలోకి ఎంటరై తెలివిగా వ్యవహరించింది. ఎంతగా కవర్ చేసినా హేమ పార్టీకి వచ్చింది అనడానికి బెంగళూరు పోలీసుల వద్ద పక్కా ఆధారాలు ఉండడం, పైగా డ్రగ్స్ టెస్టులో పాజిటివ్ రావడంతో ఆమె సైలెంట్ మోడ్‌లోకి వెళ్లిపోయింది. లేదంటే ఆవిడ నాటకాలకు అడ్డూఅదుపు లేకుండా పోయేదని నెటిజన్లు చురకలంటిస్తున్నారు. ఎక్కడో పరాయి రాష్ట్రంలో తెలుగు చిత్ర పరిశ్రమ పరువు పోతుంటే టాలీవుడ్ పెద్దలు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఏం చేస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్వయంగా మా అధ్యక్షుడు మంచు విష్ణు సైతం ఆమెకు అండగా నిలవడాన్ని పలువురు పెద్దలు తప్పుబడుతున్నారు. దోషిగా తేలే వరకు హేమ నిర్దోషేనని అందుచేత నిరాధారమైన వార్తలు, కథనాలు ప్రచారం చేయొద్దని మీడియాకు, ప్రజలకు మంచు విష్ణు విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. మొత్తానికి హేమ చట్టమంటే ఏ మాత్రం గౌరవం లేకుండా వ్యవహరించడంపై ఆమెపై జనాలకు ఏవగింపు కలుగుతుందనే భావించవచ్చు.