JAISW News Telugu

Telangana Congress : తెలంగాణ కాంగ్రెస్ కొత్త బాస్ అతడే..?

Telangana Congress

Telangana Congress

Telangana Congress : పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన వెంటనే తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు పేరును ప్రకటిస్తారని అంతా భావించారు. కానీ ఎప్పటికప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎంపిక వాయిదా పడుతూ వస్తోంది. ప్రస్తుత తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి సీఎంగా ఉండటంతో ఆ బాధ్యతలను మరొకరికి ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్ఠానం ఆలోచిస్తుంది. అసెంబ్లీ ఎన్నికలు ముగియగానే కొత్త తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిని ఎంపిక చేయాలని భావించినప్పటికీ.. ఆ ప్రభావం పార్లమెంట్ ఎన్నికలపై పడుతుందని పార్టీ అగ్ర నాయకత్వం ఆ నిర్ణయాన్ని వాయిదా వేసింది. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు కూడా ముగియడంతో పార్టీకి కొత్త రాష్ట్రాధ్యక్షుడి ఎంపికపై కాంగ్రెస్ అధిష్ఠానం కసరత్తు మొదలుపెట్టింది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఢిల్లీకి వెళ్లి పార్టీ పెద్దలతో ఈ విషయంపై చర్చించారు.

పీసీసీ పగ్గాలు చేపట్టే విషయంలో రేవంత్ రెడ్డి వారసుడు ఎవరనే ఉత్కంఠకు తెరపడినట్లు తెలుస్తోంది. తెలంగాణ పీసీసీ కొత్త అధ్యక్షుడిగా ప్రస్తుత వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్‌ను కాంగ్రెస్ హైకమాండ్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఒకటి రెండు రోజుల్లో ఆయన పేరును కాంగ్రెస్ హైకమాండ్ అధికారికంగా విడుదల చేయనుంది. పీసీసీ అధ్యక్షుడి రేసులో కాంగ్రెస్‌ మంత్రులతో పాటు కొందరు అగ్రనేతలు పోటీ పడ్డారు. తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు కోమటిరెడ్డి బ్రదర్స్, జగ్గారెడ్డి, మధుయాష్కీ గౌడ్, బలరాం నాయక్, సీతక్క పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. అయితే చివరకు రేసులో మహేష్ కుమార్ గౌడ్, బలరాం నాయక్ పోటీ పడ్డారు.

ఈక్రమంలో మహేష్ కుమార్ గౌడ్ వైపు కాంగ్రెస్ హైకమాండ్ మొగ్గు చూపిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. రేవంత్ రెడ్డి తో మహేష్ రెడ్డికి సన్నిహిత సంబంధాలు ఉండడం, బీసీ నాయకుడు కావడం, NSUI నుంచి పార్టీలో ఎదిగిన నేతగా గుర్తింపు ఉండడంతో మహేష్ కుమార్ గౌడ్‌ వైపు పార్టీ అగ్రనాయకత్వం మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సైతం మహేష్ కుమార్ గౌడ్ పేరే సిఫార్సు చేశారట.  పార్టీకి ప్రభుత్వానికి మధ్య సమన్వయం చెడిపోకుండా ఆయనైతే బాధ్యతలు సరిగ్గా నిర్వహిస్తారని అధిష్టానం భావిస్తూ ఉండడంతో, మహేష్ కుమార్‌కు పీసీసీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించడానికి సిద్ధమవుతున్నారట. ఆషాఢమాసం రాక ముందే పీసీసీ చీఫ్ ను త్వరలోనే అధికారికంగా వెళ్లడించనున్నట్లు తెలుస్తోంది.

Exit mobile version