JAISW News Telugu

AP Congress Party : కాంగ్రెస్ కు వైఎస్ కుటుంబమే ఏపీలో దిక్కైందా?

AP Congress Party

YS Family for AP Congress Party

AP Congress Party : అందరూ ఊహించిందే జరిగింది. వైఎస్ షర్మిలను ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా హైకమాండ్ నియమించింది. ఈమేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా కేసీ వేణుగోపాల్ ఓ ప్రకటన విడుదల చేశారు. నిన్నటి దాక ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న గిడుగు రుద్రరాజుకు ప్రమోషన్ వరించింది. ఆయనకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో స్థానం లభించింది. సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమించబడ్డారు. దీంతో ఏపీ రాజకీయాల్లో అన్నాచెల్లెలి మధ్య సమరం ప్రారంభం కాబోతుంది.

కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం తీవ్ర సంక్షోభంలో ఉంది. ఈ సారి లోక్ సభ ఎన్నికల్లో గెలవకుంటే పార్టీ భవిష్యత్ కు ప్రమాదం. ఇప్పటికే రెండు టర్మ్ లను బీజేపీ పగ్గాలు చేపట్టింది. మరోసారి గనుక బీజేపీ గెలిస్తే కాంగ్రెస్ మరింత కుంచించుకుపోవడం ఖాయం. అందుకే కాంగ్రెస్ పార్టీ ప్రతీ రాష్ట్రాన్ని కీలకంగా చూసుకుంటోంది. ఇక దక్షిణాదిలో కర్నాటర, తెలంగాణలో అధికారంలో ఉంది. ఇక కేరళ, తమిళనాడుల్లో మిత్రపక్షాలు అధికారంలో ఉన్నాయి. మిగిలింది ఏపీ మాత్రమే.

ఒకప్పుడు ఏపీ కాంగ్రెస్ కంచుకోట. ఐదు దశాబ్దాలకు పైగా ఇక్కడ అధికారంలో ఉంది. ఇక 2004నుంచి 2014 వరకు కాంగ్రెస్ కు తిరుగులేకుండా ఉంది. ఈ వరుస విజయాలకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి చరిష్మానే కారణం. ఆయన పాదయాత్రతోనే ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ అధికారంలోకి రాగలిగింది. అలాగే ఇక్కడ దాదాపు 35 ఎంపీ సీట్లను గెలిచి కేంద్రంలోనూ కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి దోహదం చేసింది. ఉమ్మడి ఏపీలో ఎంతో మంది నేతలు ఉన్నా.. వన్ అండ్ ఓన్లీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వల్లే కాంగ్రెస్ వైభవం కొనసాగిందడంలో సందేహాలు అక్కర్లేదు.

ఇక ఆయన మరణం, జగన్ కొత్త పార్టీ, 2014లో తెలంగాణ ఏర్పాటు..వంటి ఘటనలతో ఏపీలో కాంగ్రెస్ పార్టీ జీరో స్థాయికి పడిపోయింది. క్యాడర్ అంతా జగన్ తో వెళ్లిపోవడంతో కొందరు సీనియర్ నేతలు మిగిలిపోయారు. పార్టీ మొత్తం స్లీపింగ్ మోడ్ లోకి వెళ్లిందని చెప్పాలి. ఇక రాబోయే లోక్ సభ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలంటే ఏపీ కూడా కీలకమే కాబట్టి .. రాష్ట్రంపై కూడా హైకమాండ్ ఫోకస్ చేసింది.

తమ పార్టీకి వెన్నముకలా ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫ్యామిలీ చరిష్మాతోనే ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించకుంది. ఈమేరకు షర్మిలను పార్టీలో చేర్చుకోవడంతో పాటు పీసీసీ పగ్గాలు కట్టబెట్టింది. షర్మిల రాకతో వైఎస్ కుటుంబం రెండు చీలడం ఖాయం. ఇద్దరూ పార్టీలు వేరు కావడంతో ఇద్దరి మధ్య విమర్శలు, ఆరోపణలు తప్పవు. అన్నపై షర్మిల పోరాటం తప్పదు. ఏ రకంగా చూసినా ఈ పరిణామాలు జగన్ పై ప్రభావం పడక తప్పదు. ఇక జగన్ పార్టీలో సీట్లు రానివారు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఇప్పటికే ఇద్దరు, ముగ్గురు కమిట్ అయ్యారు. నామినేషన్ల నాటికి పలువురు కాంగ్రెస్ లోకి క్యూ కట్టడం ఖాయం. అలాగే వైఎస్ అభిమానుల్లో కొంతమంది షర్మిల వైపు మొగ్గు చూపే అవకాశాలు కూడా ఉన్నాయి.

దీంతో షర్మిల రాకతో జీరో స్టేజీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కొద్ది స్థాయిలోనైనా ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. గతంలో 1శాతం దాక ఉన్న ఓటు బ్యాంకు కనీసం 5 శాతం దాక చేరుకోవచ్చు. ఇది ఓ రకంగా కాంగ్రెస్ పార్టీకి మేలు చేకూరేదే. ఏపీ నుంచి ఒక్క లోక్ సభ సీటు వచ్చినా ఆ పార్టీకి ప్రయోజనమనే చెప్పాలి. ఏపీలో కాంగ్రెస్ పార్టీ మనుగడకు వైఎస్ కుటుంబమే దిక్కైందని బల్లగుద్ది మరి చెప్పవచ్చు.

Exit mobile version