Irrigation Department : ప్రస్తుతం సాగునీటి పారుదల రంగంలో ఉద్యోగుల పరిస్థితి అధ్వానంగా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ పిల్లర్ కుంగిన కారణంగా పరువు గంగలో కలిసింది. ఇన్నాళ్లు మా ఘనత అని చెప్పుకున్న బీఆర్ఎస్ నేతల ఓటమికి పరోక్షకారణం ఇదే. దీంతో ఇప్పుడు కాళేశ్వరం ముప్పు బీఆర్ఎస్ నేతలకు, అధికారులకు చుట్టుకుంది. ఈ శాఖలో పనిచేసిన ఉద్యోగులను తొలగించాలని ప్రస్తుత ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
సాగునీటి పారుదలకే బీఆర్ఎస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత కల్పించింది. రూ. లక్ష కోట్లు వెచ్చించి కాళేశ్వరం నిర్మించింది. తాము ఏదో ఘన కార్యం చేశామని చెప్పింది. కానీ అందులోని నాణ్యత లోపాలు బయటకు రావడంతో ఏం చేయాలో అర్థం కావడం లేదు. అనుకున్నదొకటి అయ్యింది ఒక్కటి బోల్తా కొట్టిందిరో బుల్ బుల్ పిట్ట అని తేల్చుకోలేకపోతున్నారు.
కాళేశ్వరంపై విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తప్పవని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. దీంతో బీఆర్ఎస్ నేతల్లో వణుకు పుడుతోంది. తమను ఎక్కడ జైలు పాలు చేస్తారోననే బెంగ వారిని పట్టుకుంటోంది. చేసిన తప్పుకు శిక్ష అనుభవించాల్సిందేనని అంటున్నారు. అప్పటి మంత్రి హరీష్ రావుకు భయం వెంటాడుతోంది.
ప్రస్తుతం ఆ శాఖలో ఉద్యోగ కాలం ముగిసినా మురళీధర్ రావు అనే ఉద్యోగిని బీఆర్ఎస్ ప్రభుత్వం బాధ్యతల్లో ఉంచింది. ఇప్పుడు ఆయనను ఉద్యోగం నుంచి తప్పుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో పదవి కాలం పూర్తయినా ఎందుకు ఆయనను ఉంచుకున్నారనే వాదనలు వస్తున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలు కార్యరూపం దాల్చడానికి ఇలాంటి వారిని అట్టిపెట్టుకున్నారనే విమర్శలు వస్తున్నాయి.