England Test Series : బుధవారం (జనవరి 25) నుంచి ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా టెస్ట్ సిరీస్ కు భారత జట్టు సన్నద్ధం అవుతోంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా ఈ సిరీస్ కొనసాగుతుంది. 5 మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ ఇంగ్లాండ్ తో తలపడబోతోంది.
తొలి మ్యాచ్‌కు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వబోతోంది. 25న ఉదయం 9:30 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. ఫిబ్రవరి 2న విశాఖపట్నంలో రెండో మ్యాచ్ జరగనుంది. మూడో మ్యాచ్ 15వ తేదీన రాజ్‌కోట్‌లో, నాలుగోది ఫిబ్రవరి 23న రాంచీలో ముగుస్తాయి. మార్చి 7వ తేదీ హిమాచల్ ప్రదేశ్, ధర్మశాలలో 5వ మ్యాచ్ జరుగుతుంది.
ఈ టెస్ట్ సిరీస్‌కు రోహిత్ శర్మ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. దీని తరువాత ఐపీఎల్ 2024 మొదలవుతుంది. మార్చి 23వ తేదీ నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఉంటుంది. టెస్ట్ సిరీస్ ముగిసిన వెంటనే ఇది ప్రారంభం అవుతుంది. స్వదేశంలో జరగబోయే టెస్ట్ సిరీస్‌లో ఇంగ్లాండ్‌ను మట్టి కరిపించేందుకు టీమిండియా రంగం సిద్ధం చేసుకుంది.
తొలి రెండు టెస్టులకు విరాట్ కొహ్లీ దూరమైన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని విరాట్ ఇప్పటికే ప్రకటించాడు. హైదరాబాద్, విశాఖపట్నంలో తొలి 2 టెస్టుల నుంచి తను తప్పుకుంటున్నానని, ఈ నేపథ్యంలో తన పేరును పరిశీలించొద్దని బీసీసీఐకి విజ్ఞప్తి చేశాడు.
దీనికి గల కారణాలను కొహ్లీ ఇప్పటికీ వెళ్లడించలేదు. వ్యక్తిగత కారణాలని మాత్రం మీడియా ముందు చెప్తున్నాడు. ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన టీ-20 తొలి మ్యాచ్‌కు కూడా డుమ్మా కొట్టాడు కొహ్లీ. బలమైన ఇంగ్లాండ్‌తో ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న టెస్ట్ సిరీస్ తొలి మ్యాచ్‌ల నుంచి వైదొలిగాడు.
విరాట్ స్థానంలో రజత్ పటిదార్‌ను ఎంపిక చేసింది బీసీసీఐ. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ తరుఫున ఐపీఎల్ ఆడుతున్నాడు ఈ మధ్యప్రదేశ్ బ్యాటర్. గతేడాది టీమిండియా తరఫున వన్డే ఇంటర్నేషనల్స్‌లోనూ అడుగుపెట్టాడు. సౌతాఫ్రికా సిరీస్‌కు ఎంపికయ్యాడు. ఇప్పుడు టెస్టుల్లో అరంగేట్రం చేస్తున్నాడు.
భారత్ ఏ-జట్టుకు ప్రాతినిధ్యం వహించిన రజత్ పటిదార్.. ఇంగ్లాండ్ లయన్స్‌పై విరుచుకుపడిన విషయం తెలిసిందే. బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు చేశాడు. మొదటి మ్యాచ్‌లో 111, రెండో మ్యాచ్‌లో 151 రన్స్ చేశాడు. ఫుల్ ఫామ్ కొనసాగిస్తున్న నేపథ్యంలో అతన్ని టెస్టుల్లోకి తీసుకుంది బీసీసీఐ.
విరాట్ స్థానాన్ని వెటరన్ బ్యాటర్ చేతేశ్వర్ పుజారా, అజింక్య రహానె, రంజీ స్టార్ ప్లేయర్ సర్ఫరాజ్ ఖాన్‌తో భర్తీ చేస్తారని మొదట్లో వార్తలొచ్చాయి కానీ.. అన్నింటికంటే భిన్నంగా రజత్ పటిదార్ వైపే బీసీసీఐ మొగ్గు చూపింది. ఈ సాయంత్రానికి అతను హైదరాబాద్‌కు వచ్చి జట్టుతో కలుస్తాడు.