IPL 2024 : పంజాబ్ అదుర్స్.. రికార్డ్ బ్రేక్ ఛేజింగ్

IPL 2024

IPL 2024

IPL 2024 : పంజాబ్ కింగ్స్, కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన మ్యాచ్ లో ఐపీఎల్ లోనే కాకుండా టీ 20 క్రికెట్ లోనే అత్యధిక పరుగుల ఛేజింగ్ తో పంజాబ్ కింగ్స్ రికార్డులు బద్దలుకొట్టింది. టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ కెప్టెన్ సామ్ కరన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. పంజాబ్ చెత్త ఫీల్డింగ్తో సులభమైన క్యాచ్ లు జారవిడవడంతో కోల్ కతా ఓపెనర్లు  సునీల్ నరైన్, పిల్ సాల్ట్ పది సిక్సులు, పదిహేను ఫోర్లలో విధ్వంసం సృష్టించారు.

సునీల్ నరైన్ 32 బంతుల్లో 71 పరుగుల చేయగా.. పిల్ సాల్ట్ 37 బంతుల్లో 75 పరుగులు చేశాడు. మొదటి వికెట్ కు పది ఓవర్లలోనే 131 పరుగులు జోడించి పంజాబ్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. శ్రేయస్ అయ్యర్, వెంకటేశ్ అయ్యర్, అండ్రీ రస్సెల్ రాణించడంతో  కోల్ కతా నిర్ణీత 20 ఓవర్లలో 261 భారీ స్కోరు సాధించింది. పంజాబ్ బౌలర్లలో అర్షదీప్ రెండు వికెట్లు తీసుకోగా.. రాహుల్ చాహర్ ఒక్కడే కాస్త పొదుపుగా బౌలింగ్ చేసి ఒక వికెట్ పడగొట్టాడు.

అనంతరం 262 పరుగుల చేధన లో పంజాబ్ కింగ్స్ అదరగొట్టింది.  పంజాబ్ ఓపెనర్  ఇంఫాక్ట్ ప్లేయర్ గా వచ్చిన ప్రభుసిమ్రన్ ఫోర్లు, సిక్సులతో చెలరేగి ఆడి స్కోరు బోర్డును పరుగులెత్తించాడు. 20 బంతుల్లోనే 5 సిక్సులు, 4 ఫోర్లు బాది 54 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు. ఫామ్ కోల్పోయి సతమతమవుతున్న జానీ బెయిర్ స్టో ఒక్కసారిగా తన జూలు విదిల్చాడు. 48 బంతుల్లో 9 ఫోర్లు, 8 సిక్సులతో చెలరేగి ఆడి 108 పరుగులతో అజేయంగా నిలిచాడు.

నాలుగో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన శశాంక్ సింగ్ 28 బంతుల్లోనే 8 సిక్సులు, 2 ఫోర్లతో పంజాబ్ కు రికార్డ్ బ్రేకింగ్ విజయాన్ని అందించాడు. శశాంక్ సింగ్ విధ్వంసం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. బెయిర్ స్టో, శశాంక్ సింగ్ విధ్వంసంతో ఇంకా ఎనిమిది బంతులు మిగిలి ఉండగానే పంజాబ్ కింగ్స్  అలవోకగా.. 262 పరుగుల టార్గెట్ ను ఛేజ్ చేసి ఔరా అనిపించింది. ఈ మ్యాచ్ లో అనేక రకాల రికార్డులు బద్దలయ్యాయి. ఐపీఎల్ చరిత్రలోనే 42 సిక్సులతో రికార్డు బ్రేక్ కాగా..  టీ20 లో  అత్యధిక రన్ ఛేజింగ్ చేసిన మొదటి జట్టుగా పంజాబ్ నిలిచింది.

TAGS